
Balagam Actor Muralidhar Goud: ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు బలగం మూవీ నటులు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉంటున్నారు. ఈ చిత్ర ప్రధాన పాత్రల్లో నారాయణ ఒకటి. నారాయణ పాత్రను డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ పోషించారు. కొమురయ్య అల్లుడిగా ఆయన నటించారు. బామ్మర్దులు అంటే గిట్టని బావ పాత్రలో మెప్పించాడు. బలగం మూవీ మురళీధర్ గౌడ్ కి విపరీతమైన ఫేమ్ తెచ్చింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి మొన్నటి వరకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు.
మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ… మెదక్ జిల్లా రామాయంపేట మా స్వస్థలం. సిద్దిపేటలో నా విద్యాభ్యాసం సాగింది. మేము ఐదుగురు సంతానం. నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి. నేను చదువుకునే రోజుల్లో కఠిన పేదరికం అనుభవించాను. మా ఇంట్లో కనీసం పది రూపాయలు ఉండేవి కావు. నాన్న ఇంటికి దూరంగా పనులు చేస్తూ ఉండేవారు. ఓ పది రూపాయలు అవసరమైతే బంధువుల్లో కొంచెం స్థితిమంతుల ఇంటికి మా అమ్మ అప్పుకు పంపేది. ఇస్తారో లేదే? ఏమంటారో? అని నేను సందిగ్ధతకు లోనయ్యేవాడిని.
నాన్న వచ్చాక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసే వాళ్ళం. కష్టాల మధ్య డిగ్రీ పూర్తి చేశాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 27 ఏళ్ళు పని చేసి రిటైర్మెంట్ తీసుకున్నాను. అప్పటికి నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో. ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంత మాత్రమే. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. అందరూ ఎగతాళి చేసేవారు. ఎన్నో అవమానాలు అనుభవించాను… అని మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు.

బలగం మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆయనకు నటుడిగా మరిన్ని ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. కాగా అంతర్జాతీయ వేదికలపై బలగం మూవీ సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. కొన్ని అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది. ఆయన నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్లోనే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు. మరో ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చారు.