https://oktelugu.com/

srisailam : పీఠాధిపతుల పోరులో.. ఆగిన మల్లన్న మహాకుంభాభిషేకం

కుంభాభిషేకాన్ని కార్తీక మాసంలో నిర్వహిస్తామని అధికారులు  ప్రకటించారు.  కానీ ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన రూ.2 కోట్ల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పీఠాల రాజకీయ జోక్యంతో దేవస్థానాల్లో సంప్రదాయాలకు బ్రేక్ పడుతుండడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : May 22, 2023 / 04:42 PM IST
    Follow us on

    Srisailam : ఏపీలో పీఠాధిపతులకు ఎనలేని క్రేజ్. గత ఎన్నికల్లో తన విజయానికి ప్రజాబలంతో పాటు యాగాలు ఒక కారణమని జగన్ బలంగా విశ్వషిస్తున్నారు. తన కోసం యాగాలు చేసిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు ఎనలేని ప్రాధాన్యత చూపుతున్నారు. అస్ధాన గురువుగా పరిగణిస్తున్నారు. ఆయన చేసే అన్నిరకాల సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారు. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా రాజగురువు అనుమతి, అనుగ్రహం పొందుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి శారదా పీఠానికి ఇటీవల ప్రాధాన్యత తగ్గింది. తన అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన దేవదాయ శాఖ అధికారులపై స్వరూపానందేంద్ర పట్టరాని కోపంతో ఉన్నారు. చివరకు స్వామిని కూల్ చేయడానికి చివరి రోజు యాగాన్ని పిలవాల్సి వచ్చింది. సీఎం జగన్ దంపతుచే పూజలు చేసే చాన్స్ రావడంతో స్వామిజీ కాస్తా మెత్తబడ్డారు.

    అయితే ఓవరాల్ గా ఇటీవల ఏపీ ప్రభుత్వపరంగా శారదా పీఠానికి ప్రాధాన్యత తగ్గింది. ఆ స్థానాన్ని శృంగేరి పీఠం కొట్టుకుపోయింది. దీంతో  ఆ రెండు పీఠాల మధ్య ఆధిపత్య పోరాటం పెరిగిపోయింది. ఫలితంగా అది ఏపీలో ప్రముఖ దేవస్థానాలతో పాటు దేవాదాయ శాఖ నిర్ణయాలపై ప్రభావం పడుతోంది. ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. ఆలయాల్లో లోక కళ్యాణార్ధం జరిపే పూజలు ఏకంగా వాయిదా పడుతున్నాయి. ఈ నెల 25 నుంచి 31వ వరకు శ్రీశైలం మల్లన్నకు జరగాల్సిన మహా కుంభాభిషేకం ఆగిపోయింది. దీనికి ఎండలను కారణంగా చెబుతున్నా అసలు విషయం శృంగేరి పీఠానికి , శారదా పీఠానికి మధ్య వచ్చిన బేధాభిప్రాయలే కారణంగా తెలుస్తోంది.

    శ్రీశైలం దేవస్థానంలో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరపాలన్నా, మార్పు చేర్పులు చేయాలన్నా శృంగేరీ పీఠాన్నే సంప్రదించేవారు. అది ఆనవాయితీగా వస్తోంది కూడా.  అయితే ఈ సారి శ్రీశైలం మహా కుంభాభిషేకాన్ని తామే నిర్వహిస్తామంటూ విశాఖ శారదా  పీఠం ముందుకొచ్చింది. స్వరూపానందేంద్ర స్వామి కావడంతో ప్రభుత్వ పెద్దలు కూడా కాదనలేకపోయారు. ఈనెల 25 నుంచి 31 వరకూ దివ్యమైన ముహూర్తంగా స్వామిజీ నిర్ధారించారు. దీంతో రూ.6 కోట్లతో అంగరంగ వైభవంగా కుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు అధికారులు డిసైడయ్యారు. రూ.2 కోట్లతో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ శ మహాకుంభాభిషేకానికి విశాఖ శారదా పీఠం పెట్టిన ముహూర్తం సరైనది కాదని పండితులు తేల్చడంతో దేవాదాయ శాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.

    ప్రతీ పుష్కర కాలానికి  శ్రీశైలంలో మహా కుంభాభిషేకం జరపడం ఆనవాయితీగా వస్తోంది.  ఐదేళ్ల క్రితం మహాకుంభాభిషేకం నిర్వహణకు సిద్ధం అయ్యారు. కానీ… అప్పుడు కూడా అయ్యవారి, అమ్మవారి అర్చకుల మధ్య విభేదాలతో అది ఆగిపోయింది. ఇప్పుడు పీఠాల మధ్య కుమ్ములాటలో మరోసారి నిలిచిపోయింది.  కుంభాభిషేకాన్ని కార్తీక మాసంలో నిర్వహిస్తామని అధికారులు  ప్రకటించారు.  కానీ ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన రూ.2 కోట్ల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పీఠాల రాజకీయ జోక్యంతో దేవస్థానాల్లో సంప్రదాయాలకు బ్రేక్ పడుతుండడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.