
Cohabitation: కొన్ని పెళ్లిల్లు పెద్దలు కుదుర్చుతారు. మరికొన్ని పిల్లలే కుదుర్చుకుంటారు. పెద్దలు కుదిర్చితే సంప్రదాయమంటారు. పిల్లలు కుదుర్చుకుంటే ప్రేమంటారు. ఈ రెండు కాని పద్ధతిని సహజీవనం అంటారు. సహజీవనం ఇప్పుడు ట్రెండీగా మారింది. సహజీవనం పేరుతో పెళ్లి కాకుండానే కాపురం పెట్టేస్తున్నారు. ఆ కాపురాలు మధ్యలోనే కూలిపోతున్నాయి. దీంతో సహజీవనం పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రేమ పెళ్లిళ్లను ఒకప్పుడు సమాజం ఒప్పుకునేది కాదు. ప్రేమంటే పాపమన్నట్టు పెద్దల వ్యవహారం ఉండేది. కాలక్రమేణా మార్పు వచ్చింది. పిల్లల ప్రేమను కొందరు పెద్దలు అర్థం చేసుకోసాగారు. ప్రేమ పెళ్లిళ్లకు జై కొడుతున్నారు. మరికొందరు ఇప్పటికీ పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. కులాంతర వివాహాలను కూడా మొదట్లో పెద్దలు ఒప్పుకోలేదు. ఎన్నో పరువు హత్యలు కూడా జరిగాయి. కానీ కాలక్రమేణా మనుషుల్లో మార్పు వచ్చింది. పెళ్లి కొడుకు మంచోడైతే చాలు.. ఏ కులమైతే ఏముంది అనే పరిస్థితి వచ్చింది. కులాలు వేరైనా ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి చేసేస్తున్నారు.
ఇప్పుడు సమస్య ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలతో కాదు. సహజీవనంతోనే. సహజీవనం చట్ట ప్రకారం తప్పు కాకపోయినా ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. చిన్న పరిచయంతోనే అమ్మాయిలు, అబ్బాయిలు సహజీవనంలోకి అడుగుపెడుతున్నారు. ఇంట్లో పెద్దలకు తెలియకుండా కాపురం పెట్టేస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్నారు. సర్దిచెప్పడానికి ఇంట్లో పెద్దలు లేకపోవడంతో సహజీవనం మూణ్ణాళ్ల ముచ్చట అవుతోంది. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య జీవితం పట్ల ఒక అర్థవంతమైన అవగాహన లేకపోవడం ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయి.

సహజీవనం మన సంస్కృతి కాదు. ప్రేమ పెళ్లి కూడా మన సంస్కృతి కాదు. విదేశీయులు వదిలివెళ్లిన అవశేషాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ప్రేమ పెళ్లిల్ల ట్రెండ్ పెరగడానికి అప్పట్లోని సినిమాలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇప్పడు సహజీవనం ట్రెండీగా మారడానికి కూడా సినిమా నటులే కారణమని చెప్పవచ్చు. సినిమాల ప్రభావం సమాజం పై అధికంగా ఉంటుంది. సినిమా వాళ్లు ఏది అనుసరిస్తే.. జనం కూడా దానినే అనుసరిస్తారు. అదొక ట్రెండ్ లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇదే సమస్యను తెచ్చిపెడుతోంది.
పదికాలాల పాటు కలిసి ఉంటే సహజీవనం కూడా తప్పు కాదు. కానీ కొన్నేళ్లు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. అంతటితో ఆగకుండా అమ్మాయిల ప్రాణాలు బలిగొంటున్నారు. జైళ్లలో ఊచలు లెక్కపెడుతున్నారు. దీనికోసమా సహజీవనం చేయాల్సింది. నూరేళ్ల బంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకోవడానికా అన్నది ఆలోచించుకోవాలి. అమ్మాయిలు కూడా అలాంటి అబ్బాయిలనే నమ్ముతున్నారు. పెద్దలు కుదిర్చినా, ప్రేమ పెళ్లి అయినా, సహజీవనమైనా ఇంకేదైనా.. దానికొక చట్టబద్ధ రక్షణ ఉండాలి. ఇరువురికి సమస్య వస్తే పరిష్కరించే పరిస్థితి ఉండాలి. అప్పుడే ఎలాంటి బంధమైన నూరేళ్లు కొనసాగుతుంది.