Homeజాతీయ వార్తలుBRS Vs BJP: బీజేపీ గెలుపుపై సవాళ్లు.. బీఆర్‌ఎస్సోళ్ల మేకపోతు గాంభీర్యం!

BRS Vs BJP: బీజేపీ గెలుపుపై సవాళ్లు.. బీఆర్‌ఎస్సోళ్ల మేకపోతు గాంభీర్యం!

 

BRS Vs BJP
BRS Vs BJP

BRS Vs BJP: తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే అధికార పార్టీ నేతల్లో తెలియని టెన్షన్‌ కనిప్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. వ్యతిరేకతను ఎలా పోగొట్టుకోవాలని ఆందోళన చెందుతున్నారు. స్ట్రాటజిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో తమకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని చెప్పేందుకు అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు. అదే సమయంలో బీజేపీ గురించి తమకు తెలియకుండానే పదేపదే మాట్లాడుతున్నారు. విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. నిద్రలో లేపి రాజకీయాల గురించి అడిగినా బీజేపీనే గురించే మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎంతలా భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చు.

బీజేపీ అభ్యర్థులపై ఆరా..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇంకా ఎనిమిది నెలలే గడువు ఉంది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం ఖాయం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ వచ్చే ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్సే అని చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్‌ నేతలేమో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రత్యర్థి అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ టికెట్‌ ఆశించే నాయకులు ప్రత్యర్థి గురించి ఆరా తీస్తున్నారట. గత ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి ఎంత బటపడ్డాడు. ఈ సారి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని క్యాడర్‌ ద్వారా తెలుసుకుంటున్నారు. ముఖ్యమంగా బీజేపీ తరఫున తనపై పోటీచేసే అభ్యర్థి ఎవరు? అతడి బలం ఎంత? ఆదాయ వనరులు ఏమిటి? పార్టీ పెద్దల అండగ ఎలా ఉంది? జనం స్పందన ఎలా ఉంది? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలని లెక్కలు వేసుకుంటున్నారు.

బీజేపీ విజయంపై పందెం…
ఇక బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల గెలుపుపై కొందరు ఎమ్మెల్యేలు పందెం కూడా కాస్తున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ బీజేపీ తరఫున బరిలో దిగారు. ఈ సందర్భంగా అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విపక్షాలకు సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తాను పదవికి రాజీనామా చేస్తాన న్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. గువ్వల బీజేపీ నేతలకు టార్గెట్‌ అయ్యారు. బీజేపీ అభిమాని నుంచి మొదలు ఆ పార్టీ నాయకుల వరకు అందరూ గువ్వల బాలరాజుకు ఫోన్‌చేసి మరీ ఎప్పుడు రాజీనామా చేస్తావని ప్రశ్నించడం ప్రారంభించారు. ఫోన్‌ కాల్స్‌ను తట్టుకోలేక గువ్వల బాలరాజు ఒకానొక దశలో అసహానికి గురై దుర్భాషలాడారు. మీడియా ముందుకు వచ్చి ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్లు తనకు వస్తున్న ఫోన్‌కాల్స్‌ గురించి చెప్పుకున్నారు.

BRS Vs BJP
BRS Vs BJP

ఆ జాబితాలోకి రసమయి..
తాజాగా ఈ సవాళ్ల జాబితాలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేరారు. ఇటీవల మానకొండూర్‌ నియోజకవర్గం రిపోర్టుపై ఓ టీవీ చానెల్‌లో స్టోరీ ఇచ్చారు. నియోజకవర్గంలో రసమయికి ఎదురుగాలి వీస్తోందని అందులో సారాంశం. దీంతో ఆందోళన చెందిన రసమయి.. ఓ యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా తనకు పాజిటివ్‌గా ప్రచారం చేయించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలో దళిత, గిరిజన ఎమ్మెల్యేల ఓటమికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళితులు, గిరిజనులు అంటేనే ఆ పార్టీకి గిట్టడం లేదని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. అక్రమాస్తులంటూ ప్రచారం చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కార్డును పదేపదే వళ్లించారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రస్తావన కూడా వచ్చింది. స్పందించిన రసమయి.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు గెలిస్తే.. తాను మళ్లీ మానకొండూర్‌లో గెలిచిన తర్వాత కూడా పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. రసమయి గెలిచింది వందల ఓట్ల తేడాతోనే అని, వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ గెలుపుపై సవాళ్లు చేశారు. పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చాలానే కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వీరి జాబితాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరినా ఆశ్చర్య పోనక్కర లేదు. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రసమయి ఇంటర్వ్యూపై నెటిజట్లు కామెంట్లు పెడుతున్నారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు కేటీఆర్‌ ఎన్ని ఓట్లతో గెలిచాడో చెప్పాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌ ఎందుకు లాక్కున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోతే రసమయి దుర్భాషాడిన మాటలు గుర్తు చేస్తున్నారు. గువ్వల ఫోన్‌ కాల్స్‌తో బుక్కయితే.. రసమయి నెటిజన్ల కామెంట్స్‌కు బుక్కవుతున్నారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular