Thailand Husband And Wife: లాటరీ లైఫ్‌ను మార్చేస్తుంది. పేదవాడిని గొప్పవాడిగా చేస్తుంది. ధనవంతుడిని మరింత సంపన్నుడిగా చేస్తుంది. కోటి రూపాయల లాటరీ తగిలితే ఇల్లు, కార్లు, బంగలాలు, బంగారం, నగలు ఇలా లైఫే మారిపోతుంది. కష్టాలన్నీ దూరమౌతాయి. కానీ ఇక్కడ ఓ లాటరీ భర్తనే మార్చేసింది. రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న ఓ భార్య ఆ విషయం దాచి.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఫస్ట్ మొగుడిని పరేషాన్ చేస్తోంది.
భర్త కొరియాలో.. భార్య థాయ్‌లాండ్‌లో..
థాయ్‌లాండ్‌కు చెందిన నారిన్ అనే వ్యక్తికి 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమొత్తంలో అప్పులు ఉండటంతో.. సంపాదన కోసం భార్యాభర్తలు 2014లో దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే, కుమార్తెలను చూసుకునేందుకుగానూ భార్య థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చింది. నారిన్ నెలనెలా రూ.70 వేలకుపైగా ఇంటికి పంపుతూ వచ్చాడు.
కోర్టును ఆశ్రయించిన భర్త..
ఈ క్రమంలో పిల్లలను చూసుకుంటున్న భార్య లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఇందులో ఆమె అదృష్టం కలిసి వచ్చి రూ.2.9 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పలేదు. దీంతో భర్త దక్షిణ కొరియాలో కష్టపడుతూనే ఉన్నాడు. అంతులేని సంపద రావడంతో భార్య థాయ్‌లాండ్‌లో ఎంజయ్ మొదలు పెట్టింది. ఇటీవల ఆ విషయం తెలుసుకున్న నారిన్ షాక్ అయ్యాడు. అంతేకాదు.. ఆమె మరో పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు.
ఫోన్ చేసినా స్పందించకపోవడంతో..
నారిన్ భార్య లాటరీలో రూ.2.9 కోట్లు గెలుచుకున్న తర్వాత పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. అయితే ఈ ఆనందాన్ని భర్తతో పంచుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. భర్తకన్నా సంపదే ముఖ్యమనుకుంది. విషయం దాచిపెట్టి విలాసాల్లో మునిగితేలింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో ఉంటున్న భర్త ఇటీవల భార్యకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురై స్వదేశానికి వచ్చాడు. తీరా.. ఇక్కడికి వచ్చాక.. ఆమె ఓ పోలీసు అధికారిని పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని కంగుతిన్నాడు.
కోటి రూపాయలకుపైగా ఖర్చు..
ఏం చేయాలో తెలియని నారిన్ 20 ఏళ్ల వైవాహిక బంధంలో ఆమె ఇలా చేస్తుందని ఏరోజూ ఊహించలేదని మదన పడ్డాడు. ఆమె బ్యాంకు ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెక్‌చేశాడు. అందులో రూ.1.40 కోట్లు ఉన్నట్లు గుర్తించాడు. అంటే అప్పటికే ఆమె రూ.కోటికి పైగా ఖర్చు చేసింది. ఇలాగే వదిలేస్తే తాను అన్యాయమైపోతానని భావించిన నారిన్ న్యాయం కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు.. అసలు విషయం కనుక్కునే పనిలో పడ్డారు.
మొత్తంగా ఓ టాలరీ టిక్కెట్ జీవితంతోపాటు భర్తను కూడా మార్చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.