Homeట్రెండింగ్ న్యూస్KTR ACB Notice : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

KTR ACB Notice : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

KTR ACB Notice : మళ్లీ ఇప్పుడు కేటీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం అదే వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది. అయితే కేటీఆర్ భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల వేడుకలకు అమెరికా వెళ్తున్న నేపథ్యంలో.. తనకు కాస్త గడువు కావాలని.. అమెరికా నుంచి వెళ్లి వచ్చిన తర్వాత తాను విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా కేటీఆర్ పంచుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనకు నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు తనకు గతంలోనే నోటీసులు జారీ చేశారని.. అప్పుడు విచారణకు హాజరయ్యారని.. మళ్లీ ఇప్పుడు నోటీసులు జారీ చేశారని.. ఇప్పుడు కూడా విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల గురించిన హామీల విషయంలో వెనకడుగు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్షాలను మాత్రం కేసులపేరుతో తీవ్రంగా వేధిస్తోందని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని.. అటువంటి వాటికి బెదిరే ప్రసక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

స్పందించిన ఎమ్మెల్సీ కవిత

కేటీఆర్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు..” ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదు. పైగా ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేయడం సరైన విధానం కాదు. ఇటువంటి వేధింపులు భారత రాష్ట్ర సమితి నాయకులకు కొత్త కాదు. ఇటువంటి ఇబ్బందులు ఎన్నైనా సరే ఎదుర్కొని.. తట్టుకొని నిలబడిన శక్తి కెసిఆర్ సైనికులకు ఉందని” కవిత పేర్కొన్నారు. అయితే ఇటీవల కెసిఆర్ కుమార్తె తను రాసిన లేఖలు బయటికి వచ్చాయి. అందులో గులాబీ సుప్రీం ను ప్రశ్నిస్తూ అనేక విషయాలు ఉన్నాయి. పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ లేఖలో కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ లేఖలు సరిగ్గా కల్వకుంట్ల కవిత అమెరికా నుంచి రావడానికి ఒకరోజు ముందుగా బయటికి వచ్చాయి. దీంతో ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ లోని విమానాశ్రయం లాంజ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన తండ్రి దేవుడని.. ఆయన చుట్టూ దయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలో ఏదో జరుగుతోంది అనే ప్రచారం మొదలైంది. ఇక దీనికి తోడు కల్వకుంట్ల కవిత అనుచరులు చేసిన హంగామా సంచలనం సృష్టించింది. గులాబీ సుప్రీం కూతురు లెటర్స్ వ్యవహారం బయటికి వచ్చిన మరుసటి రోజు కల్వకుంట్ల తారక రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తారకరామారావు నిర్వహించిన విలేకరుల సమావేశం అనంతరం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అనుచరులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే నిన్న కల్వకుంట్ల కవిత ప్రధాన అనుచరుల్లో ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇక సోమవారం కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఆయన సోదరి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించడం.. ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగిపోయాయి. అయితే మొత్తంగా కుటుంబంలో ఏర్పడిన కోల్డ్ వార్ మొత్తానికి తగ్గినట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version