
Krishnavamshi- Brahmaji: సినిమా కష్టాల కంటే దారుణంగా ఉంటాయి సినిమాల్లో ఎదగాలని పరిశ్రమకు వచ్చే వాళ్ళ కష్టాలు. ఇప్పుడు టాప్ యాక్టర్స్ గా, డైరెక్టర్స్ గా వెలిగిపోతున్న వాళ్ళందరూ దుర్భరమైన కష్టాలు పడ్డోళ్లే. సినిమాపై ఫ్యాషన్ తో చేతిలో చిల్లిగవ్వ లేకుండా రైలెక్కి చెన్నై, హైదరాబాద్, ముంబై చెక్కేస్తూ ఉంటారు. తనలాంటి ఓ నలుగురిని పోజేసుకొని మకాం పెడతారు. ఈ రోజుల్లో కొంచెం పర్లేదు. టాలెంట్ ఉంటే సినిమా అవకాశం వచ్చే వరకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా అవసరాలకు సరిపడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకప్పుడు యూట్యూబ్ లు, ఓటీటీలు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరితే భోజనం పెట్టి పదోపరకో ఇచ్చేవాళ్ళు. షూటింగ్ లేని రోజు అది కూడా ఉండదు.
అత్యంత దుర్భరమైన పేదరికం అనుభవించిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. రవితేజ, కృష్ణవంశీ, దర్శకుడు తేజ, ఉత్తేజ్, బ్రహ్మాజీ ఒకేసారి పరిశ్రమకు వచ్చారు. కృష్ణవంశీ పలువురు దర్శకుల వద్ద పనిచేశారు. రామ్ గోపాల్ వర్మకి కూడా అసిస్టెంట్ గా వ్యవహరించారు. వర్మ మాదిరి ఫిల్మ్ మేకింగ్ లో కృష్ణవంశీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. కృష్ణవంశీ ప్రతిభ తెలిసినవాడిగా వర్మ తన నిర్మాణంలోనే ఆయన్ని దర్శకుడిగా లాంచ్ చేశారు. గులాబి చిత్రంతో కృష్ణవంశీ డైరెక్టర్ అయ్యారు.
న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన గులాబి యూత్ కి బాగా నచ్చేసింది. మూవీ సూపర్ హిట్ అందుకుంది. దాంతో నాగార్జున పిలిచీ మరి ఆఫర్ ఇచ్చాడు. వారి కాంబోలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడిగా కృష్ణవంశీ నిలదొక్కున్నాడు. మూడో చిత్రం సింధూరం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. ఆ చిత్రానికి కృష్ణవంశీ నిర్మాత కూడాను. పెద్ద మొత్తంలో నష్టపోయాడు.

ఎలాంటి ఫేమ్ లేని బ్రహ్మాజీని హీరోని చేసి సింధూరం మూవీతో నష్టపోయారు కదా… అని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీని అడగడం జరిగింది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. నెల ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు నాకు బస్సు ఛార్జీలకే సరిపోయేవి. తరచుగా పస్తులు ఉండాల్సి వచ్చేది. ఒకరోజు ఖాళీ కడుపుతో ఉన్న నా దగ్గరకు బ్రహ్మాజీ వచ్చి ‘అన్నం తిన్నావా?’ అని అడిగాడు. మొహమాటానికి నేను తిన్నాను అని చెప్పాను. అయినా తను గుర్తించి నాకు భోజనం పెట్టించాడు. అప్పుడు బ్రహ్మాజీ నాకు అన్నం పెట్టించకపోతే ఇంకో ఐదు నిమిషాల్లో నేను క్రిందపడి పోయేవాడిని, అని చెప్పుకొచ్చాడు. పరోక్షంగా ఆ రుణం హీరో పాత్ర ఇచ్చి తీర్చుకున్నానని చెప్పాడు.