
Kohinoor Diamond: వజ్రాల్లో మేలిమైనది అంటే కోహినూర్ పేరే చెబుతాం.. ఈ వజ్రం దొరికింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో అయినప్పటికీ.. బ్రిటన్ రాజకుటుంబానికి తరలి వెళ్ళిపోయింది. కోహినూర్ వజ్రం మొదట్లో కాకతీయుల ఆధీనంలో ఉండేది.. చరిత్రకారుల అధ్యయనం ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలికాపూర్ తో సంధి చేసుకుని అపారమైన సంపద, కోహినూర్ వజ్రం సమర్పించుకున్నాడని అంటారు. ఇక ఇక్కడి వజ్రం అక్కడికి ఎలా వెళ్లిందనేది పెద్ద చరిత్ర.. గత ఏడాది బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన రాణి ఎలిజబెత్_2 కన్నుమూశారు. మరణించేవరకు ఆమె కిరీటంలోనే కోహినూర్ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె దాన్ని ధరిస్తూ వచ్చారు. రాణి మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్_3 పట్టాభిషిక్తుడు కానున్నాడు. విక్టోరియా మహారాణి కోహినూర్ గురించి రాసిన వీలునామా ప్రకారం చార్లెస్ భార్య, బ్రిటన్ రాణి కెమిల్లా దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్ ను పోలిన మరో వజ్రం ధరిస్తారని ఇటీవల బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.. చరిత్రలో కోహినూర్ ధరించిన రాజులు మొత్తం కాలగర్భంలో కలిసిపోయారు. అందుకే చార్లెస్ _ 3, కెమిల్లా వజ్రాన్ని దూరం పెడుతున్నారు.
ఇక కోహినూర్ వజ్రాన్ని 1304లో ఢిల్లీ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు.. దాన్ని సమర్ఖండ్ కు పంపించాడు. 1526 నాటికి ఈ వజ్రం మొగల్ రాజు బాబర్ చేతికి వచ్చింది. దీనిని సుల్తాన్ ఇబ్రహీం లోడి తనకు బహుమతిగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు.. ప్రపంచంలో ఒకరోజు ఉత్పత్తి అయ్యే సంపదలో సగం ధరకు సమానమైనది కోహినూర్ అని బాబర్ నామాలో వ్యాఖ్యానించాడు. బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఈ వజ్రం మొగల్ వారసుల చేతులు మారుతూ వచ్చింది. ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహమ్మద్ కాలంలో ఇది పరాయి వారి సొంతమైంది.
పర్షియన్ జనరల్ నాదిర్ షా 1739 నాటికి భారత దేశంలో అడుగు పెట్టాడు.. ఆ తర్వాత సుల్తాన్ మహమ్మద్ కిరీటంపై కన్నేశాడు. నాదిర్ షాకు లొంగిపోయిన సుల్తాన్ మహమ్మద్ ఖరీదైన వజ్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పుడు ఆ వజ్రం నాణ్యత,మెరుపు చూసి దానికి కోహినూర్ గా నామకరణం చేశాడు. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే కాంతి శిఖరం అని అర్థం. అయితే కోహినూర్ ను చేజిక్కించుకొని భారత్ విడిచి పర్షియా వెళ్ళిన నాదిర్ షా దానిని తన బంగారు సింహాసనంలో పొదిగాడు. షా 1747లో హత్యకు గురి కావడంతో షా జనరల్స్ లో ఒకరైన అహమ్మద్ షా దుర్రాని చేతుల్లోకి కోహనూర్ వెళ్ళింది. దుర్రానీ వారసుడు షా షుజా దుర్రానీ 1813 లో కోహినూర్ ను తిరిగి భారత్ తీసుకొచ్చాడు. రాజ్యం స్థాపించిన రంజిత్ సింగ్ కు దానిని అప్పగించాడు. ప్రతిగా అప్ఘాన్ సింహాసనం షా షుజా దుర్రానీ దక్కించుకునేందుకు రంజిత్ సింగ్ సహాయం చేశాడు.

బ్రిటిష్ వారు పంజాబ్ ఆక్రమణకు దండెత్తడంతో సిక్కు రాజులకు, బ్రిటిష్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. 1849 నాటికి బ్రిటిష్ పాలకులు పంజాబ్ ను పూర్తిగా ఆక్రమించి ఆభరణాలను జప్తు చేశారు. రంజిత్ సింగ్ చనిపోవడంతో ఆయన సతీమణి రాణి జిందన్ ను ఖైదు చేసి జైలుకు పంపించారు. వారి కుమారుడైన బాలుడు దులీప్ సింగ్ తో బ్రిటిష్ వారు లాహోర్ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. వెంటనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అక్కడి నుంచి భారీ ఓడలో వజ్రాన్ని తరలిస్తుండగా కలరా ప్రబలి చాలామంది చనిపోయారు. 1850లో బ్రిటన్ లో ఉన్న క్వీన్ విక్టోరియా వద్దకు డైమండ్ చేరింది. దానిని ఆమె లండన్ లో ప్రదర్శనకు ఉంచారు. కోహినూర్ వన్నె తగ్గిందని భావించిన విక్టోరియా 1852లో దానికి మెరుగులు దిద్దించాలని నిర్ణయించారు. డచ్ కు చెందిన జువెల్లర్ కాంటోర్ కు అప్పగించగా కోహినూర్ 108.93 కేరట్లకు పడిపోయింది.
కోహినూరు చరిత్రలో దానిని ధరించిన లేదా తమ వద్ద దాచుకున్న రాజులు ఎవరు కూడా బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు. దీంతో జాగ్రత్త పడిన విక్టోరియా ఆరుదైన సందర్భంగా మాత్రమే దాన్ని ధరిస్తూ వచ్చింది. మహారాణులు మాత్రమే ఈ వజ్రని ధరించాలంటూ వీరు నామ కూడా రాసింది. ఒకవేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రానికి ఆ వజ్రాన్ని ధరించే హక్కు ఉంటుందని అందులో పేర్కొన్నది. విక్టోరియా తర్వాత దాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ _2 తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం కోహినూర్ వజ్రం టవర్ ఆఫ్ లండన్ వద్ద ఉన్న జీవన్ హౌస్ లో ఉంది.. ఈ వజ్రాన్ని తమకు ఇవ్వాలని భారత్ పలుమార్లు కోరినప్పటికీ బ్రిటన్ తిరస్కరిస్తూ వస్తోంది..ఇదే డిమాండ్ ను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా చేస్తున్నాయి. ఈ వజ్రాన్ని ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంత సుముఖంగా లేదు.
