
Air Pollution: ఇంత వరకూ బయట కాలుష్యం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పెరుగుతున్న కర్బన ఉద్గారాల గురించి, తీవ్రమవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల గురించి ఆందోళన చెందుతున్నాం. కానీ మన ఇంట్లో బయట వాతావరణం కంటే ఎక్కువ కాలుష్యం వెలువడుతోందంటే నమ్ముతారా?
ఒకప్పుడు ఇంట్లో ఏసీ ఉందంటే గొప్పగా చూసేవాళ్లం. శీతల గాలిని ఆస్వాదిస్తున్న వారి దర్జా వేరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు టాక్సిక్ హోం సిండ్రోమ్, సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ కలవర పెడుతున్న సమస్యలు. ఫలితంగా చాలా మంది వాటిని నిరోధించేందుకు ఎయిర్ ఫిల్టర్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు..
రోడ్ల కన్నా ఇల్లే పదిలం అనుకున్నాం. ఫ్యాక్టరీలు మాత్రమే కాలుష్య కారకాలను విడుదల చేస్తున్నాయని నమ్మాం. వాటికన్నా మన ఇల్లే ప్రమాదకరం. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఇంటి కన్నా బయటే నయం అనే రోజుల్లోకి వచ్చాం. ఇంటి గాలి ఒంటికి మంచిది కాదు అనేది ఇప్పుడు నమ్మి తీరాల్సిన నిజం.
ఇంట్లో అడుగు పెట్టగానే పాదాలకు కార్పెట్ మెత్తగా తగలాలి. గదిలోకి రాగానే మంచి పరిమళం స్వాగతం పలకాలి. ఏసీ గదిలో సింథటిక్ రగ్గులు వెచ్చదనాన్ని ఇవ్వాలి. కానీ ఇలాంటి వస్తువులే మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే నమ్ముతారా? ఇంట్లో ప్లాస్టిక్ బొమ్మలు, రగ్గులు, బ్యాగులు వంటివి రాపిడికి, ఘర్షణకు, వేడికి, కాంతి ప్రభావానికి గురయినప్పుడు వాటి నుంచి చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు బయటకు వస్తాయి. అవి గాలిలో కలుస్తాయి. మన ముక్కులు పీల్చుకున్న గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళతాయి. అలా రక్తంలో కలిసి ఆస్థమా, క్యాన్సర్, అలర్జీ వంటి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలు ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నవాళ్లు ఎక్కువ గాలి పీల్చుకుంటారు.
ముంచుకొస్తున్న ప్రమాదం
మైక్రో ప్లాస్టిక్.. చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువుల సముదాయం. మనం వాడుతున్న టూత్ పేస్టులు, డీయోరెంట్లు, బాడీ స్ప్రేలు, ఆలంకరణకు వాడే వస్తువుల ద్వారా మైక్రో ప్లాస్టిక్ ను ఏళ్ల తరబడి పీలూస్తూనే ఉన్నాం. రోగాల బారిన పడుతూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 300 లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. కేవలం 9 శాతం మాత్రమే పునర్వినియోగం అవుతోంది. మిగతాది క్రమక్షయం చెంది మైక్రో ప్లాస్టిక్ గా విడిపోతోంది. ఇది గాలిలో కలుస్తోంది. దానిని పీల్చి మనం రోగాల బారిన పడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్లాస్టిక్ గాలి పీలుస్తున్నాం. భూమిని, నీటిని కలుషితం చేసినట్టుగానే మనల్నీ కలుషితం చేస్తోంది. ఆరుబయట కన్నా ఈ కాలుష్యం మన ఇంట్లో ఎక్కువగా ఉండటం దురదృష్టకరం.
పాలీఎథిలిన్ ప్రమాదకరం
మాములుగా మనం ముఖం శుభ్రం చేసుకునేందుకు స్క్రబర్స్ వాడతాం. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఉంటాయి. వీటిని మైక్రో బడ్స్ అంటారు. మనం వాడే టూత్ పేస్టులు, సౌందర్య ఉత్పత్తులు, క్లెన్సర్లలో ఉంటాయి. నిజానికి ఇవి పాలీఎథిలిన్ కు సంబంధించిన సూక్ష్మరూపాలు. బట్టలు ఉతికినప్పుడు, అలంకరించుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు మైక్రో ప్లాస్టిక్ రేణువులు లక్షల్లో గాల్లోకి విడుదలవుతాయి. మైక్రోబడ్స్ వినియోగాన్ని అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు దాదాపుగా నిషేధించాయి. మన దేశంలో ప్లాస్టిక్ నీటిని శుద్ది చేసే ప్రక్రియ అభివృద్దికి నోచుకోలేదు.
ఆ కాలుష్యం వేర్వేరు
ఇండోర్ కాలుష్యం పల్లె, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెలపొయ్యిలు, ధూమపానం కారణమయితే..పట్టణ ప్రాంతాల్లో కాలుష్య కారకాల జాబితా చాలా ఎక్కువ. ముఖ్యంగా ఓలటైల్ కంపౌండ్స్ అంటే ఆవిరయ్యే రసాయనిక ఉత్పత్తుల వాడకం ఎక్కువ. గోడలకు వేసే రంగులు, వాడే పెర్ ఫ్యుమ్ లు, గదిలో పరిమళం పంచే రూమ్ ఫ్రెషనర్లు, డియోరెంట్లు, ఇంటి అలంకరణకు వాడే సింథటిక్ మెటీరియల్, జిగుర్లు, వెలిగించే అగరుబత్తులు, పూజా సామగ్రి, దోమల నివారణ మందు, క్రిమి సంహారుణులు, అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చే వంటకాలు(బీబీక్యూ), స్నానాలగదిలో వాడే లిక్విడ్లు, వంటపాత్రలు శుభ్రం చేసేందుకు వాడే డిష్ వాష్ లు ఇవి నైట్రోజన్ డై యాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఓలటైల్ కంపౌండ్స్ ను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ కారక ఫార్మాల్డీహైడ్ లు గా మారతాయి. వీటి కారణంగా మనకు చర్మ క్యాన్సర్లు, అలర్జీలు వస్తున్నాయి. వీటితో పాటు ఇంక్, ఇన్సులేషన్ ఫోం, నురగ వంటివి కూడా ప్రమాదకర కాలుష్య కారకాలే. ఇండోర్ కాలుష్యం ఇళ్ళకే కాదు.. పెద్దపెద్ద కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్ మాళ్లకూ వర్తిస్తుంది.

పరిష్కారాలు ఇవిగో..
నాసో ఫిల్టర్లు చూడ్డానికి బ్యాండ్ ఎయిడ్ ఫిల్టర్ల మాదిరే ఉంటాయి. వాటిని నేరుగా ముక్కు రంద్రాలకు అతికించుకోవచ్చు..ఇవి ధూళి కణాలను 90 శాతం వరకు అడ్డుకుంటాయి.
బొగ్గులపై వండే వంటకాలను ఇంట్లో కాకుండా ఆరుబయట చేయాలి.
నాణ్యమైన హెపా( హై ఎఫియన్సీ పర్టికులేటేడ్ ఎయిర్) యంత్రాలను ఇంట్లో బిగించుకోవాలి.
సింథటిక్ రగ్గులు, కార్పెట్లకు బదులు కాటన్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మనీ ప్లాంట్ వంటి ఇండోర్ మొక్కల పెంపకం చేపట్టాలి.
రూమ్ రిఫ్రెషనర్ లకు బదులుగా స్వచ్ఛమైన ఉదయపు గాలిని లోపలకు ఆహ్వానించాలి.
