
KCR Birthday Song: తెలంగాణ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. మరో పది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిన కేసీఆర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడం ద్వారా అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదం పొందడానికి ఒక్కో నేత ఒక్కో రీతిలో వేడుకలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో భక్తి కంటే భజనే ఎక్కువగా కనిపిస్తోంది.
పాట కైగట్టించిన సీనన్న..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 69వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు తమకు నచ్చిన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 14 ఏళ్ల పాటు ఉద్యమ సారధిగా, 8 ఏళ్లుగా రాష్ట్ర సంక్షేమ సారధిగా తెలంగాణను, పార్టీని ముందుకు నడిస్తున్న కేసీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో, వీడియో పాటను ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్∙రామకృషక్ణగౌడ్ ఏటా ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేయడాన్ని మంత్రి అభినందించారు. ఈ ఆడియో, వీడియో సాంగ్ రూపకల్పనకు సహకారం అందించిన పాట రచయిత పుట్ట శ్రీనివాస్, గాయకుడు రాంకీ, సంగీత దర్శకులు రాజ్ కిరణ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులను నింపుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
నాడు పోరాటం..నేడు అభివృద్ధి..
స్వరాష్ట్రం కోసం 13 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అని శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. నాటి పోరాట స్ఫూర్తితో నేడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడని వివరించారు.
బ్రెయిలీలో కేసీఆర్ చరిత్ర…
ఇక తెలంగాణ దివ్యాంగుల సంఘం కేసీఆర్ చరిత్రను బ్రెయిలీలో రూపొందించి తన భక్తిభావం చాటుకుంది. దేశంలో ఏ నేతకు లేనివిధంగా కేసీఆర్ జీవిత చరిత్రను బ్రెయిలీకి ఎక్కించింది. దీనిని కేసీఆర్ తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. దీనిని రూపొందించిన దివ్యాంగులను అభినందించారు.

మొత్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఏ రూపంలో చేసినా.. అందుకు ఓ అర్థం పరమార్థం, దాని వెనుక ఆంతర్యం ఉంది. ఎన్నికల్లో టికెట్ సంపాదించడమా, మళ్లీ సర్కార్ వస్తే మంత్రి పదవి చేపట్టడమా, ఇతర పదవులు ఆకాంక్షించడమా ఇలా ఏదో ఒక స్వార్థం లేకుండా గులాబీ బాస్ పుట్టిన రోజుకు ఇంత ఖర్చు ఎందుకు పెడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
