KCR- BJP: తనను రాజకీయంగా ఎదగకుండా ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ ను, భారత రాష్ట్ర సమితి పై నేరుగా యుద్ధం చేసేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు.. అంతే కాదు మనకు దక్కిన గౌరవం ఎలా ఉందో చూస్తున్నాం కదా అంటూ కార్యకర్తల్లో సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు ఉమ్మడి జిల్లాలో తన రాజకీయ ప్రాభవం చెక్కుచెదరకుండా ఉండేందుకు విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు.

కేసీఆర్ కు పోటీగా..
ఈనెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో భారీ సభ పెట్టబోతున్నారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నిర్వహించబోయే తొలి భారీ సమావేశం ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారానే ఆయన భారత రాష్ట్ర సమితి అడుగులకు సంబంధించి దిశా నిర్దేశం చేయబోతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఈ సభలో ఛత్తీస్ గడ్ ప్రాంతానికి చెందిన నేతలు భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం కనిపిస్తున్నది.. ఇదే వేదికపై కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన నాయకులు కూడా భారత రాష్ట్ర సమితిలో చేరుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. కొంతమంది కమ్యూనిస్టు నాయకులను కూడా ఈ సభకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటీవల భారత రాష్ట్ర సమితికి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపిన విషయం విధితమే.. అయితే ఈ బంధాన్ని మరింత ముందుకు సాగించే విధంగా కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం.
పొంగులేటి ముందు ముందుకే..
18న కెసిఆర్ సభ ఖరారు కావడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఆయన నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఆయన వెంట డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డి సి సి బి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మట్టా దయానంద్ విజయకుమార్ ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వీరందరికీ కూడా టికెట్లు ఇవ్వాలనే ప్రపోజల్ ను అమిత్ షా ముందు పొంగులేటి ఉంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పటికే పలుమార్లు అమిత్ షా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సంభాషించినట్టు సమాచారం. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఖమ్మం నుంచి పోటీలో నిలబెట్టాలని బిజెపి అధిష్టానం యోచిస్తోంది.

మారిన రాజకీయ సమీకరణాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలకు నాంది పలకాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది.. ఇప్పటికే పలు జిల్లాల్లో కీలకంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులకు అమిత్ షా నుంచి ఫోన్లు వెళ్లాయని తెలుస్తోంది. తెర వెనుక వ్యవహారాలను ఈటల రాజేందర్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.. బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్ నమూనాను తెలంగాణలో అమలు చేయాలని అమిత్ షా ప్లాన్ గా ఉన్నట్టు సమాచారం. పొంగులేటి తర్వాత కొంతమంది ధైర్యం చేసి బిజెపిలో చేరితే ఇక్కడ ఆ పార్టీ కావడం ఖాయం.. అదే జరిగితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరమవుతాయి.