
CM KCR: రాజ్ దీప్ విడుదల చేసిన వీడియోతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. కేసీఆర్ అంత డబ్బు సంపాదించాడా? ఆ స్థాయిలో సంపాదించేందుకు ఆయన ఏం చేసి ఉంటాడు? ఇప్పుడు ఆ డబ్బుతోనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకుంటున్నాడా? ఇవే చర్చలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ కిందా మీద పడుతోంది కానీ.. ఇవాల్టికీ నరేంద్ర మోదీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు లేడు. మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎవర్ని చూసుకున్నా.. ఒక్కొక్కరి కింద నలుపు మరకలు బోలెడు..కానీ వీరిలో ఏ ఒక్కరూ మోదీ ని నిలదీసి నిలబడే సాహసం చేయలేకపోతున్నారు. పైగా ఎవరికివారు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవాలని ఉబలాటపడుతున్నారు.. గతంలో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారు. మోదీ వేసిన పాచిక వల్ల 23 స్థానాలకు పడిపోయారు. అధికారానికి దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నేర్చుకున్న పాఠం వల్ల చాలామంది ముందుకు రావడం లేదు.
ప్రధానమంత్రి తో ఎక్కడ చెడిందో గాని కెసిఆర్ మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సమయం దొరికితే చాలు ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సొంత పత్రికలో అయితే రోజు నరేంద్ర మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కెసిఆర్ లో ఆత్మవిశ్వాసం పాళ్ళు ఎక్కువ కాబట్టి నరేంద్ర మోదీ వ్యతిరేక కూటమికి తానే నాయకత్వం వహిస్తానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. అయితే ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ ఒక వీడియో రూపంలో వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు అంత చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి కెసిఆర్ దగ్గర ఉన్నది 9 మంది ఎంపీలు. 2019 ఎన్నికల్లో ఏకంగా కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓడిపోయింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వినిపిస్తోంది. ఈడి కూడా రెండుసార్లు విచారించింది. ఆర్థిక బలం ఉంటే ఉండవచ్చును కానీ.. దేశ విపక్షాలను లీడ్ చేసేంత దమ్ము కేసిఆర్ కు ఉందా? కెసిఆర్ మార్గదర్శనంలో మిగతా పార్టీల నాయకుడు పని చేస్తారా? ఈ ప్రశ్నలకు కొంత ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతాన్ని విమర్శించిన కేసీఆర్.. కేంద్రం మీద కోపంతో ఉత్తరాది నాయకులను, ఉత్తరాది ప్రాంతాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఇలాంటప్పుడు ఉత్తరాది ప్రాంత నాయకులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎలా పనిచేస్తారు? ఒకవేళ పని చేసినా కెసిఆర్ ని ప్రధానమంత్రిగా ఎందుకు ఎన్నుకుంటారు.

చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తే చాలు ఢిల్లీని ఏలవచ్చు. అందుకే ఈ రాష్ట్రాలను ఢిల్లీకి దగ్గర దారి అని అంటారు. మరి ఈ రాష్ట్రాల్లో కేసీఆర్ కు ఉన్న బలం ఎంత? పైగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ లో, మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉంది. ఇలాంటప్పుడు కెసిఆర్ విపక్షాల కూటమికి చైర్మన్ ఎలా అవుతారు?! కెసిఆర్ నాయకత్వాన్ని వారు ఎలా అంగీకరిస్తారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయి మహా అయితే తొమ్మిది సంవత్సరాలు.. మిగతా రాష్ట్రాలకు చెందిన విపక్షాల ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజ్ దీప్ వీడియో వల్ల కొంత చర్చ అయితే జరుగుతుందని కానీ.. కెసిఆర్ నాయకత్వాన్ని అంత ఈజీగా విపక్షాలు ఒప్పుకోవు. ఆ మధ్య బీహార్ వెళ్ళినప్పుడు నితీష్ కుమార్ కెసిఆర్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు కెసిఆర్ కు ఉన్న పాపులారిటీ.
మరోవైపు రాజ్ దీప్ విడుదల చేసిన వీడియో నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేసీఆర్ వద్ద అంత డబ్బు ఉందా అని విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.. భారత రాష్ట్ర సమితికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ఆరా తీసినట్టు సమాచారం. వాస్తవానికి దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి ధనిక పార్టీ. ఆ పార్టీ పేరిట ఉన్న డిపాజిట్లు, ఆస్తులు ₹1000 కోట్ల వరకు ఉన్నట్టు స్వయంగా ఆ పార్టీ అధినాయకత్వమే ప్రకటించింది. అంతేకాకుండా కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ఒక విమానం కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఇదంతా చాలా చిన్న విషయమని, కేవలం పైకి కనిపించేది కొంత మాత్రమే అనే అభిప్రాయం ఉంది. ఎన్నికల ఖర్చులకు, ఇతర రాజకీయ అవసరాలకు క్షణంలో నిధులు సమీకరించ గలిగే సత్తా కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారని చర్చ జరుగుతోంది.