Kapunadu Sabha- Vangaveeti Radha Krishna: అనాధిగా పల్లకీమోసిన కాపులు సమ్ థింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. పార్టీలకతీతంగా పాటు పడుతున్నారు. ఈసారి రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలోని దిగ్గజ కాపునేతలంతా ఒక్కటవుతున్నారు. రంగా వారసుడు రాధాను ఇన్ వాల్వ్ చేస్తున్నారు. గంపగుత్తగా జనసేన వైపు మరలే ఎత్తుగడ చేస్తున్నారు. చూస్తుంటే కాపు నాడు వేదికగా ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాపు నాడు కథేంటి? వంగవీటి దారెటు అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి నెలకొంది..ఏపీలో కుల సమీకరణలు అధికం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కుల రాజకీయాలు తెరపైకి వస్తుంటాయి. తెర ముందు కులాలు.. తెర వెనుక పార్టీలు ఉండి కథను నడిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా విశాఖ వేదికగా చేసుకొని నిర్వహించతలపెట్టిన కాపునాడు వెనుక ఏ పార్టీ ఉంది? ఏ పార్టీకి మద్దతుగా ఈ సమావేశం జరుగుతోంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్వహణ బాధ్యతలు చూస్తున్నది మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కావడంతో ఇది రాజకీయరంగు పులుముకుంది. వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహిస్తుండడం, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నాయకులను ఆహ్వానించడం.. పక్కా పొలిటికల్ ప్లానే అన్నట్టు వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్ పై రంగాతో పాటు పవన్, చిరంజీవిల ఫొటోలను పెద్దవిగాను.. అన్ని పార్టీల్లో ఉంటున్న కాపు నేతల పొటోలను చిన్నవిగాను ముద్రించారు. దీంతో ఇది పొలిటికల్ గానే జరుపుతున్న సమావేశంగా మెసేజ్ పంపించారు. ప్రధానంగా పవన్ నాయకత్వానికి కాపుల మద్దతు అందించడమే ప్రధాన అజెండాగా వార్తలు వస్తున్నాయి. దీంతో అందరి చూపు విశాఖపై పడింది. సోమవారం కాపునాడును వేదికగా చేసుకొని కాపులకు ఎటువంటి సమాచారం పంపిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పుడు రంగా వారసుడు రాధాక్రిష్ణ అడుగుల వైపే అందరి చూపు పడింది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలోకి వచ్చిన ఆయన ఎన్నికల క్యాంపయినర్ గా పనిచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి రాధా రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేరు. కానీ టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఎటువైపు అడుగులేస్తారన్నది ప్రశ్న. కానీ గత కొంతకాలంగా ఆయన చర్యలను గమనిస్తే మాత్రం జనసేనకు దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఒకానొక దశలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ వచ్చి రాధాతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ తన పొలిటికల్ స్టెప్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయాలని రాధా ఆలోచిస్తున్నట్టు అనుచరులు చెబుతున్నారు.
వాస్తవానికి రాధా ఏమంత యాక్టివ్ పొలిటీషియన్ కాదు. మోహన్ రంగా వారసుడిగా ఆయనకు గుర్తింపు లభించింది. చిరుప్రాయంలోనే ఎమ్మెల్యేను చేసింది. పాతికేళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా చాన్స్ దక్కించుకున్నా.. అది ఒక్కసారికే పరిమితమైంది. దూకుడుగా వ్యవహరించడం, పర్యవసానాలు పట్టించుకోకపోవడం, లాభ నష్టాలను భేరీజు వేసుకోకపోవడం వంటి కారణాలతో ఆయనకు మైనస్ గా మారింది. అయితే ఉన్నట్టుండి ఆయన పేరు ఏపీ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఆయన యాక్టివ్ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఆయన తండ్రి జయంతి, వర్ధంతి సమయంలో నివాళులర్పించడానికి, సేవా కార్యక్రమాల నిర్వహణకే పరిమితమయ్యారు. అటువంటిది రంగా, రాధా రాయల్ అసోసియేషన్ కాపు సంఘాలను అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కాపునాడు సభను నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. సభకు వంగవీటి రాధా హాజరవుతుండడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. అటు కాపు నాయకులు, ఇటు రాధా ఏం చెప్పబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2004లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసిన రాధాక్రిష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీలో చేరారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. అయితే వైసీపీలో రాధాకు ప్రాధాన్యంతగ్గింది. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు స్థానం టిక్కెట్ ఇవ్వకపోవడంతో రాధా టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే స్వల్పకాలంలో పార్టీలు మారడంపై ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. అందుకే ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆయన జనసేన గూటికి చేరే చాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి, క్రిష్ణ, గుంటూరు బాధ్యతలను పవన్ కళ్యాణ్ రాధాక్రిష్ణకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో పొత్తుల అంశం ఒక కొలిక్కి వచ్చిన తరువాతే ఆయన రాజకీయంగా స్టెప్ వేసే అవకాశముందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అప్పటివరకూ కాపునాడు యాక్టివిటీస్ తో పాటు మోహన్ రంగా పేరిట కార్యక్రమాల్లో విరివిగా పాల్లొనాలని రాధా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విశాఖ కాపునాడు మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడతారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.