CM KCR: తెలంగాణ అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న ఉదయం కొత్త ఏడాదిలో రాబోతోందా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నారా? పార్టీలో ఉన్న అసంతృప్త సీనియర్ నాయకులను, ప్రజాక్షేత్రంలో పట్టు ఉన్న నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారా? అందులో భాగంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారా? సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందా? రాష్ట్రంలో ముగ్గురు మంత్రుల పనితీరుపై అసంతప్తితో ఉన్న కేసీఆర్ వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారా? అంటే అవుననే సమాధానం వస్తోంది బీఆర్‌ఎస్ వర్గాల నుంచి.

అసంతృప్తులను బుజ్జగించేందుకు..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అసంతృప్తులు పక్కచూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి, ప్రజాక్షేత్రంలో పట్టు ఉన్న నాయకులకు, అసంతృప్త సీనియర్ నాయకులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల తర్వాత ఒకసారి మాత్రమే సీఎం కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు.
సంక్రాంతి తర్వాత ముహూర్తం..
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీ‹శ్‌రావుకు, అదనంగా ఆరోగ్య శాఖ కూడా కట్టబెట్టి పాలన సాగిస్తున్నారు. రెండు శాఖలు కీలకమైన శాఖలు కావడంతో హరీశ్‌రావుకు వీటిని నిర్వహించడం భారంగా మారుతుంది. ఈ క్రమంలో అసంతృప్తులను శాంతింప చేయడం కోసం సంక్రాంతి తర్వాత, లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ ముగ్గురు అవుట్..
అంతేకాదు ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో పనిచేస్తున్న ముగ్గురు మంత్రుల తీరుపై సీఎం కేసీఆర్ చాలా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరూ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పనితీరు బాగాలేదని కేసీఆర్ భావిస్తున్నట్లు గులాబీ వర్గాల టాక్. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు మంత్రుల స్థానాలను కొత్త వారితో భర్తీ చేయడానికి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారు అనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవే..
ప్రధానంగా ఈ స్థానాలను భర్తీ చేయడానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలలో పైలట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజులలో ఒకరికి క్యాబినెట్ మంత్రి హోదా దక్కే అవకాశం ఉందని సమాచారం.
బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ..
మొత్తానికి సంక్రాంతి తర్వాత తెలంగాణ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటికే పలువురు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అసలు బీఆర్‌ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.