Kaavalayya Song : అపజయం ఎలాంటి అనుభవాలు మిగులుస్తుందో.. జయం గొప్ప గొప్ప అనుభూతులను ఇస్తుంది. ప్రస్తుతం అలాంటి అనుభూతినే సన్ పిక్చర్స్ పొందుతోంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్.. ఆగస్టు పదిన విడుదల చేసింది. ఈ సినిమా విడుదలై నెల కాకుండానే 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. రజనీకాంత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పని చేసిన వారందరికీ నిర్మాణ సంస్థ చెక్కులు ఇచ్చింది. తాజాగా ఒక సంతోషకరమైన వార్తను సన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది.
జైలర్ సినిమా విజయంలో కథ, కథనం, రజనీకాంత్ నటన ఎంతటి కీలక పాత్ర పోషించాయో.. అనిరుధ్ సంగీతం కూడా అంతటి కీలకపాత్రను పోషించింది. ఇప్పటికే అనిరుధ్ స్వరపరిచిన పాటలన్నీ చార్ట్ బస్టర్డ్ గా నిలిచాయి. సినిమా విడుదలై నెల కావస్తున్న నేపథ్యంలో.. పూర్తి వీడియో సాంగ్స్ ను సన్ పిక్చర్స్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. సరిగ్గా బుధవారం సాయంత్రం 6 గంటలకు “నువ్వు కావాలయ్య” పాటను విడుదల చేసింది.. ఇప్పటికే ఈ పాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. పూర్తి వీడియో పాటను సైతం నెటిజన్లు యూట్యూబ్లో విరగబడి చూశారు.. కేవలం విడుదలైన రెండు గంటల్లోనే ఒక మిలియన్ రియల్ టైం వ్యూస్ ను ఈ పాట సొంతం చేసుకుంది.
తమిళంలో ఈ పాటను అరుణ్ రాజా కామరాజ్ రాశారు. శిల్పారావు పాడారు. అనిరుధ్ ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటకు జానీ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ఈ పాటకు తగ్గట్టుగా తమన్నా అందచందాలు ఉండడంతో ఒక రేంజ్ లో దూసుకుపోయింది. వీడియో సాంగ్ కూడా అదే స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. పాటను యూట్యూబ్లో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ మార్క్ రియల్ టైం వ్యూస్ నమోదు చేయడం పట్ల సన్ పిక్చర్స్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ లో పంచుకుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్, నృత్య రీతులు సమకూర్చిన జానీ మాస్టర్, పాట పాడిన శిల్పారావ్, తన అందచందాలతో మైమరిపింపజేసిన తమన్నా, సునీల్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండింగ్లో ఉంది.