Janasena Advisor Ram Mohan Rao- KCR: ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను బలమైన శక్తిగా మార్చాలన్న ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కాపు నేతలనే టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారు. కాపుల్లో ఉన్న విద్యాధికులు, ముఖ్యంగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దృష్టిపెట్టారు. వారందర్నీ పార్టీలోకి రప్పించి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. అందులో భాగంగా జనసేన రాజకీయ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహనరావు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే ఈ కలయిక వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ లోకి రప్పించి ఏపీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ద్వారా కాపు నేతలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారితో రామ్మోహనరావు చేతులు కలపడంతో సంక్రాంతి తరువాత చేరికల సంఖ్య పెరిగే చాన్స్ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

గత ఎన్నికల ముందు రామ్మోహనరావు జనసేనలో చేరారు. పవన్ కు రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అయిన రామ్మోహనరావు తమిళనాడు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. జయలలిత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉండే సమయంలో పాలనా వ్యవహారాలన్నీ రామ్మోహనరావే చక్కదిద్దేవారు. సమర్థవంతమైన అధికారిగా కూడా గుర్తింపబడ్డారు. పదవీ విరమణ తరువాత ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. జనసేనలో చేరారు. పవన్ కూడా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించారు. రాజకీయ సలహాదారుడిగా నియమించారు. కానీ కొంతకాలంగా ఆయన యాక్టివ్ గా లేరు. ఇప్పుడు కేసీఆర్ వద్ద ప్రత్యక్షమయ్యేసరికి ఆయన బీఆర్ఎస్ లో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.
గత కొంతకాలంగా ఆయన చేసిన కామెంట్స్ భిన్నంగా ఉన్నాయి. ఆ మధ్యన కాపు ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైనప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లనో… ఓ పరిశ్రమకు చెందిన వ్యక్తులను నమ్ముకొని కాపులు రాజకీయ చేయడం అసాధ్యమని కామెంట్స్ చేశారు.కులం నుంచి సమిష్టి నాయకత్వం వచ్చినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఏపీలో కాపులకు ఏ పార్టీ కూడా రిజర్వేషన్లు కల్పించలేదని తేల్చిచెప్పారు. బీసీలు, ఇతర సామాజికవర్గాలను కలుపుకొని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు శరవేగంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రామ్మోహనరావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది బీఆర్ఎస్ విస్తరణకేనన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఒక్క రామ్మోహనరావే కాదు.. కాపుల్లో యాక్టివ్ గా ఉన్న నాయకులపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రకటన సమయంలో కేసీఆర్ తన సొంత సామాజికవర్గం వెలమ నాయకులను తనపైకి తిప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే అందుకు భిన్నంగా కాపులపై దృష్టిపెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. మాజీ ఐఏఎస్ అధికారులైన తోట చంద్రశేఖర్, రామ్మోహనరావుల ద్వారా పార్టీ విస్తరణకు గులాబీ బాస్ పక్కా ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో కానీ.. మార్చిలో కానీ కేసీఆర్ ఏపీలో పర్యటించే చాన్స్ ఉందని.. ఇంతలో వీలైనంత మంది కాపు నేతలకు గాలం వేసే పనిలో ఉన్నట్టు సమాచారం.