Jagapathi Babu – Rajinikanth : ఏపీలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నాడు చంద్రబాబునుద్దేశించి రజనీకాంత్ మాట్లాడారు. అయితే ఆయన మాటలను తప్పుపడుతూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా సైతం అదే పనిగా రజనీకాంత్ పై విమర్శలపర్వం నడిపిస్తోంది. అటు వైసీపీలో కొనసాగుతున్న సినీ పరిశ్రమకు చెందిన రోజా, పోసాని కృష్ణమురళి వంటి వారు సైతం రజనీకాంత్ ను తక్కువచేసి మాట్లాడుతున్నారు. అయితే రజనీ విషయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఏ ‘బాబు’లు స్పందించడం లేదు. చివరకు తనకు రజనీతో అతి చనువు అని చెప్పుకునే మోహన్ బాబు సైతం స్పందించలేదు. కానీ నటుడు జగపతిబాబు మాత్రం స్పందించారు.
సాహసించని సినీ పరిశ్రమ..
అయితే ఈ విషయంలో సినీ పరిశ్రమ మౌనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమాల పరంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలానే జరిగింది. సినిమాటిక్కెట్ల విషయంలో సైతం వైసీపీ అనుచితపర్వం కొనసాగింది. అప్పట్లోకూడా ఎవరూ నోరు తెరవలేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగానే పోరాడారు. కానీ ఆయన ఓ పార్టీ అధినేతగా మాత్రమే చూశారు. హీరో రామ్ పోతినేని ఓ సందర్భంలో స్పందించారు. అమరావతికి, చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. దీంతో ఆయన సమీప బంధువులకు చెందిన ఆస్పత్రులపై దాడులు చేసి ఇబ్బందిపెట్టారు. అందుకే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులెవరూ సాహసించడం లేదు.
సన్నిహితులు మౌనం..
తమిళ సూపర్ స్టార్ అయినా.. రజనీకాంత్ కు ఏపీలో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. సినీ పరిశ్రమలో సన్నిహితులు ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధంతోనే శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. చంద్రబాబును పొగిడారన్న కారణంతో ఇప్పుడు వైసీపీకి టార్గెట్ అయ్యారు. అయితే రజనీతో చనువు ఉందని చెప్పుకునే మోహన్ బాబు సైతం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఇది పొలిటికల్ ఇష్యూ కావడంతో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు మాట్లాడలేకపోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను లెక్క చేయకుండా..ఆయన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారంటే..తమలాంటి వారిని లెక్క చేయరని చాలా మంది ముందుకొచ్చేందుకు భయపడుతున్నారు.
కుండబద్దలు కొట్టిన జగ్గూబాయ్
సరిగ్గా ఇటువంటి సమయంలోనే నటుడు జగపతిబాబు స్పందించారు. రజనీకాంత్ కు అండగా నిలిచారు. వైసీపీ నేతల తీరును పరోక్షంగా తప్పపట్టారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఇష్యూపై మాట్లాడారు. రజనీకాంత్ 100 శాతం రైట్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడే విధానం, ఆయన అనే మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు” అని చెప్పుకొచ్చాడు. మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు. అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతల చేష్టలను కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు జగపతిబాబుపై వైసీపీ శ్రేణులు ఏ విధంగా విరుచుకుపడతాయో చూడాలి మరీ.