CM Jagan: ఏదైనా రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి సంపూర్ణ విజయం దక్కాలంటే ప్రజలు 100 శాతం సంతృప్తి చెంది ఉండాలి. అప్పుడే అక్కడ సంపూర్ణ విజయం దక్కే చాన్స్ ఉంటుంది. శతశాతం కాకపోయినా.. దానికి దగ్గర వెళ్లేందుకు అవకాశముంటుంది. అయితే ఏపీ సీఎం జగన్ తాను ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే 175కు 175 స్థానాలు కొట్టేసి సంపూర్ణ విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. తన పార్టీ శ్రేణులకు కూడా అదే నూరిపోస్తున్నారు. 151 వరకూ వచ్చాం. మరో 24 కొట్టలేమా? అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల భుజం తట్టి వెళ్లి పోరాటం చేయండి అని పురమాయిస్తున్నారు. అయితే అది అంత సులభమైన విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. మైండ్ గేమ్ లో భాగమే తప్ప మరొకటి కాదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని 100 వరకూ స్థానాలు మనవే అంటే 50 స్థానాలు తగ్గిపోతాయి. అవే 120 సీట్లు వస్తాయంటే 31 స్థానాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం వెళుతుంది. అందుకే వ్యూహాత్మకంగా 175కు 175 కొట్టేస్తామని తరచూ జగన్ చెప్పుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ ది భ్రమ కాదు..ఆత్మవిశ్వాసం కాదు.. అతి విశ్వాసం కాదు.. వ్యూహాత్మకమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ సర్కారు తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. గెలుపు కూడా అంతా అషామాషి కాదు. సీఎం జగన్ కు ఇది తెలియంది కాదు. ఎప్పటికప్పుడు ప్రజల నాడిని నిఘా సంస్థలు, సర్వే సంస్థల ద్వారా తెలుసుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో సామాజిక పింఛన్లు, జీతాలు ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో సర్కారు ఉంది. కేంద్రం సహకరిస్తే కానీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేని స్థితిలో ఉంది. పథకాల్లో కోత తో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకొని ఉంది. నాలుగేళ్లలో ఏం చేయాలేకపోయామన్న బాధ ఎమ్మెల్యేల్లో ఉంది. పవర్ లేకుండా చేశారన్న కోపం సీఎం జగన్ పై వ్యక్తమవుతోంది. ఇంటా బయట ఎదురీదుతున్న సమయంలో సంపూర్ణ విజయం గురించి మాట్లాడడం కాస్తా అతే అవుతుంది.
విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాధించిన నాడు ఏపీ ప్రజలు వైసీపీని కొంత విశ్వసిస్తారు. గత ఎన్నికలకు ముందు విభజన హామీలు సాధించడంలో చంద్రబాబు ఫెయిలయ్యారని ప్రజలకు వివరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ భవిష్యత్ సాధ్యమని.. పరిశ్రమలు వెల్లవలా వస్తాయని నమ్మించారు. ప్రజలు కూడా జగన్ మాటలను నమ్మారు. చంద్రబాబు ప్రభుత్వంపై కోపాన్ని పెంచుకున్నారు. జగన్ కు అంతులేని విజయం కట్టబెట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక విభజన సమస్యలను, హామీలను మరిచిపోయారు. వాటిని సంక్షేమం అనే ముసుగులో ఖునీ చేశారు. కానీ అవి సజీవంగా ఉన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో విభజన హామీలే జగన్ కు ప్రతిబంధం కానున్నాయి. 175 స్థానాల కాన్సెప్ట్ కు చెక్ చెప్పనున్నాయి.

జగన్ చెబుతున్న 175 స్థానాల కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు . విభజన హామీల గురించి చిత్తశుద్ధితో పోరాటం చేసి కేంద్రం నుంచి సాధిస్తే ప్రజలు కొంతవరకూ ఆలోచించే అవకాశముంది. విభజన హామీల్లో భాగంగా నియోజకవర్గాల పునర్విభజనకు పట్టుబడితే ఏపీలో ఇప్పుడున్న 175స్థానాలు 225 కు పెరిగే అవకాశముందని.. అప్పుడు బాగాపాలించామన్మ ధీమా ఉంది కనుక.. 225 స్థానాల్లో కనీసం 175 స్థానాలు వచ్చే అవకాశముందని లెక్క కడుతున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన కోసం పట్టుబట్టే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం తన పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే 175 కు 175 స్థానాల కాన్సెప్ట్ తప్పితే.. ఇది వర్కవుట్ అయ్యే చాన్సే లేదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.