
AP Global Investors Summit: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను విజయవంతంగా పూర్తిచేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. గత నాలుగేళ్లుగా పారిశ్రామిక ప్రగతి లేదన్న అపవాదును కొంత చెక్ చెప్పగలిగారు. మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని ప్రకటించారు. ఒప్పందాలను సైతం చేసుకొని గట్టి సమాధానమే ఇచ్చారు. దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు తరలిరావడంతో కాస్తా ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతానికైతే ఓకే కానీ.. దీని ఫాలోప్ చేయడంలో జగన్ ఎలా ముందుకెళతారన్నది ప్రశ్న. తొలి రోజున ముకేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, భజాంక, పునీత్ దాల్మియా వంటి ప్రముఖులతో పాటుగా మరింత మంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, ప్రతీ రెడ్డి వంటి ప్రముఖులు సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. అటు జగన్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్ర సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రెండో రోజు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్రశేఖరన్ వంటి వారు హాజరయ్యారు. పారిశ్రామికరంగం నుంచి రెడ్డీస్ లేబరోటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ సీఈవో గజానన నాబర్, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ ల్యాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీక్రిష్ణ బండి, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ చలమశెట్టి సెయింట్ గోబైన్ సీఈవో సంతానం వంటి దిగ్గజాలు వచ్చారు. . వీరికి దేశీయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు, సంస్థలు ఉన్నావన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే పరిశ్రమల ఏర్పాటు అన్నది తరువాత విషయం. ముందుగా వారిని సమీకరించి.. పెట్టుబడులు పెడతామన్న ప్రకటన, ఒప్పందాల విషయంలో జగన్ చూపిన చొరవ మాత్రం అభినందనీయమే.

అయితే పెట్టబడులు వరకూ ఓకే కానీ తరువాత పర్యవసానాలు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న. సదస్సు ద్వారా మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఏపీ పాలకులు చెబుతున్నారు. కానీ ముందుగా పరిచయం ఉన్న కంపెనీలను ఒప్పించి ఒప్పందాల తంతు ముగించినట్టు టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పిందని.. ఇప్పుడు వైసీపీ సర్కారు కూడా అదే ప్రయత్నం చేసిందన్న టాక్ ఒకటైతే ఉంది. ఇప్పుడు లక్షలు, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిన కంపెనీల చేతుల్లో కనీసం రూ.10 కోట్లు లేని దుస్థితి. అవి ఎలా పెట్టుబడి పెడతాయో అన్నది ఒక చిక్కుముడి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే రెట్టింపు పెట్టుబడులు పెడతామని కొన్ని ఔత్సాహిక పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం మాత్రం అనమానాలకు తావిస్తోంది. మొత్తానికి సమ్మిట్ పరిణామాలు చూస్తే మాత్రం. ఆపరేషన్ సక్సెస్.. కానీ పెషెంట్ పరిస్థితే చెప్పలేమన్నట్టుంది. అయితే ఏదో చేశామని ప్రజలను భ్రమ కల్పించడంలో మాత్రం జగన్ కొంతవరకూ విజయం సాధించారనే చెప్పొచ్చు.
దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలు సమ్మిట్ వైపు తొంగి చూడలేదు. ఒక్క రాజ్యసభ గిఫ్ట్ గా ఇచ్చారన్న కారణంతో ముఖేష్ అంబానీ తాను రావడమే కాదు. 14 మంది డైరెక్టర్లను వెంట బెట్టుకొని వచ్చి సదస్సుకు కాస్తా కళ నింపారు. కానీ టాటా, బిర్లాలు, మహేంద్రాలు ముఖం చాటేశారు. జన్యూన్ గా ఉండే ఏ పారిశ్రామిక వేత్తలు ఇటువైపు చూసేందుకు ఆసక్తికనబరచలేదు. కేవలం గత పరిచయాలు, పొలిటికల్ లింక్ లు ఉండే చిన్నపాటి కంపెనీలు, డొల్లతనం చూపించి హడావుడి చేసి ఒప్పందాలు చేసుకున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖేష్ అంబానీ వంటి వారు వచ్చి తమకు అండగా నిలబడ్డారని.. ఇక తిరుగులేదని సంబరపడిపోతున్నారు. ఏకంగా రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊరూ వాడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది అంకెల గారడీగానే మిగులుతుందని ఏపీలో మెజార్టీ వర్గాల వారి అభిప్రాయం. అయితే సమ్మిట్ ద్వారా ఒక విషయం మాత్రం అర్ధమైంది. రాజకీయ ఇబ్బందులను అధిగమించేందుకు సమ్మిట్ ను ఒక వేదికగా చేసుకున్నారు. అందులో కొంతవరకూ జగన్ సర్కారు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. అటు సమ్మిట్ ను పూర్తిగా పాజిటివ్ గా మార్చేందుకు వైసీపీ సోషల్ మీడియా, ఐ ప్యాక్ బృందం ప్రయత్నం కూడా విజయవంతమైంది.
గత టీడీపీ హయాంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2016,17,18లో వరుసగా మూడు సీఐఐ సదస్సులను ఏర్పాటుచేశారు. మొత్తం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్టు ప్రకటించారు. అందుకు ఒప్పందాలు సైతం జరిగాయని ప్రచారం చేసుకున్నారు. కానీ రూ.50 వేల కోట్లకు మించిన ఒప్పందాలు అమలుకాలేదు. పరిశ్రమల ఏర్పాటు పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు వైసీపీ సర్కారు తాజా గ్లోబల్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెబుతోంది. కానీ ఇందులో ఎన్ని పరిశ్రమలు పట్టాలెక్కతాయన్నది ప్రభుత్వ సమర్థతపై ఆధారపడి ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలం చేసుకుంటే మాత్రం ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు జరిగే చాన్స్ ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో కొన్నిరకాల పరిశ్రమలు ఏర్పాటుకు శంకుస్థాపన జరగగా.. వైసీపీ సర్కారు రాజకీయ కోణంలో వాటిని తరిమేశాయన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి తరుణంలో మరో గవర్నమెంట్ వస్తే ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయా? అన్న ప్రశ్న తలెత్తుంది.