
Twitter Blue Tick: పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు దేశంలోని పలురువు ప్రముఖులు బ్లూటిక్‌ను కోల్పోయారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సినీనటులు సమంత, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అలియా భట్ సహా అనేక మంది ప్రముఖులు ట్విట్టర్ బ్లూటిక్ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
ఎలాన్ మస్క్‌కు ముందు ఉచితంగా..
చాలా మంది ట్విట్టర్ ఖాతాల్లో గురువారం నుంచే బ్లూ టిక్ కనపడట్లేదు. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు ఒకలా, కొనుగోలు చేసిన తర్వాత ఒకలా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ యూజర్లకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూ టిక్ అందించేది. ఎలాన్ మస్క్ వచ్చాక రూల్స్ మారిపోయాయి.
డబ్బులు కడితేనే బ్లూటిక్..
ఇక బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తామని ఇటీవలే ట్విట్టర్ ప్రకటించింది. గురువారం అన్నంత పనీ చేసింది. ప్రముఖుల ఖాతాల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు ట్విట్టర్ చర్యతో షాక్ అవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ నిబంధనలు మార్చి, మళ్లీ సైన్ అప్ చేసుకోవాలని ప్రకటించినప్పటికీ చాలా మంది చేసుకోలేదు.

మహేబ్‌బాబు, ఎన్టీఆర్‌తోపాటు కొందరికి..
ఇక టాలీవుడ్‌లో మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు ముందుగానే జాగ్రత్త పడడంతో వారి బ్లూటిక్ పోలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ యూజర్లకు షాకులు ఇస్తూనే ఉన్నారు. పలు మీడియా సంస్థలకు కూడా బ్లూటిక్ తొలగించిన విషయం తెలిసిందే. కొన్ని సంస్థలు ట్విట్టర్‌కు దూరంగా ఉంటామని కూడా ప్రకటించాయి.
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం
ఇదిలా ఉండగా టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే స్టార్ షిప్ గాల్లో పేలిపోయింది. కాగా, స్పేస్ ఎక్స్ ప్రయోగించిన అదిపెద్ద ప్రయోగం విఫలం కావడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.