Italy: వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వంటివి వచ్చినా.. భయపడాల్సిన పని లేదని చాలా మంది చెప్పినా ఇప్పటికీ మనలో కరోనా అంటే తెలియని వణుకు. మొదటి, రెండు దశల్లో అది చూపిన ప్రభావమే కారణం. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మళ్లీ ఏ వేరియంట్ విరుచుకు పడుతుందో తెలియని పరిస్థితి. ఇదీ చాలదన్నట్టు తాజాగా మంకీ ఫాక్స్ కలకలం సృష్టిస్తోంది. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. ఇలాంటి స్థితిలో ఒక వ్యక్తి ఏకంగా కరోనా, మంకీ ఫాక్స్, హెచ్ఐవీ బారిన పడ్డాడు.

ప్రపంచంలోనే మొదటిది
ఇటలీకి చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఐదు రోజుల పాటు స్పెయిన్ వెళ్ళాడు. తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చిన తొమ్మిది రోజులకు తీవ్ర మైన గొంతునొప్పి, తలనొప్పి, నడుం వాపు బారిన పడ్డాడు. ఆ నొప్పులకు వేగలేక ఇంట్లోనే ఉన్న మాత్రలను వేసుకున్నాడు. అయినప్పటికీ ఉపశమనం కలగలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కరోనాగా నిర్దారించారు. దాని నివారణకు చికిత్స ప్రారంభించారు. అయితే మూడు రోజుల తర్వాత అతడి ఒంటి పై దద్దుర్లు కనిపించాయి. దీంతో కంగారు పడిన వైద్యులు ఎందుకయినా మంచిదని పరీక్షలు చేశారు.
Also Read: Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

ఈసారి మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు అతడిని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న కాటానియా మిలట్రీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించడంతో అతడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే మధ్యలో మళ్లీ జ్వరం రావడంతో డాక్టర్లు పరీక్షలు చేయగా హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. దీంతో ఖిన్నులవడం వైద్యుల వంతయింది. ఈ అరుదైన కేసు వివరాలను ఇటలీ వైద్యులు జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ప్రచురించారు. కాగా సదరు వ్యక్తి 2021 లో హెచ్ఐవీ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చింది.