Rakshasudu 2: నాలుగేళ్ల క్రితం తమిళంలో విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా రామ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన రాక్షసన్ భారీ ఘన విజయం సాధించింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడిగా రీమేక్ అయింది. తెలుగులో కూడా ఘనవిజయం సాధించింది. తమిళంలో ఆరు కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మిస్తే 50 కోట్ల దాకా వసూలు చేసింది. తెలుగులో 16 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్ల దాకా వసూలు చేసింది. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటిదాకా క్రైమ్ సినిమాలు అంటే మూస ధోరణిలో ఉండేవి. కానీ రాక్షసుడు విడుదలైన తర్వాత దర్శకుల ఆలోచన పంథా మారింది. ఒక రకంగా చెప్పాలంటే థ్రిల్లర్ జోన్ లో రాక్షసుడు సినిమాని తోపు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో క్రిస్టోఫర్ పాత్ర ద్వారా దర్శకుడు ప్రేక్షకులను సీటు చివరి అంచులో కూర్చోబెట్టాడు. అంతటి ఇంపాక్ట్ ఉన్న ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే తెలుగులో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.

కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో
తెలుగులో రాక్షసుడు సినిమాని సత్యనారాయణ నిర్మించారు. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఇటీవల ఒక అద్భుతమైన ఫ్లాట్ చెప్పడంతో సత్యనారాయణకు నచ్చి పార్ట్- 2 నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సీక్వెల్లో బెల్లంకొండే హీరోగా కనిపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో దర్శకుడు రమేష్ వర్మ కూడా లీడ్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ మేరకు చాలామంది హీరోలను పరిశీలించారు. చివరిగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇటీవల విక్రాంత్ రోణా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సుదీప్ ముందుకు వచ్చారు. పైగా ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రమేష్ వర్మ చెప్పిన రాక్షసుడు సీక్వెల్ స్టోరీ నచ్చడంతో సుదీప్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించనున్నారు.
Also Read: Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
మిగతా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో మొదటిసారి రాక్షసుడు సినిమా తీసినప్పుడు 16 కోట్ల బడ్జెట్ పెట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ తక్కువ కాబట్టి 23 కోట్ల వరకు వసూళ్ళు దక్కాయి. అయితే సుదీప్ కు తెలుగు, కర్ణాటక, తమిళనాడు, హిందీలో మంచి మార్కెట్ ఉండడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాత అనుకుంటున్నారు. హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో మరింత గ్రిప్పింగ్ కథ తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మొదటి పార్ట్ కంటే మరింత ఎక్కువగా థ్రిల్లర్ అంశాలు జోడించనున్నట్లు సమాచారం. ఇందులో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం.

క్రిస్టోఫర్ గా అతడు
రాక్షసుడు సినిమాకి ప్రధాన బలం క్రిస్టోఫర్. ఈ పాత్రను సీక్వెల్లో మరింత బలంగా రాసుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ. అయితే ఈ పాత్రకు విజయ్ సేతుపతిని సంప్రదించారు. ఆయన ఇంకా ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఒకవేళ గనుక ఆయన ఓకే చెప్తే రాక్షసుడు పార్ట్ 2 కు సౌత్ లో మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇప్పటికే కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సంతానం అనే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. విజయ్ సేతుపతి కి సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ కనుక ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా మరో స్థాయికి వెళుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని నిర్మాత కోనేరు సత్యనారాయణ యోచిస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.