Homeట్రెండింగ్ న్యూస్Mother : ఈరోజుల్లో తల్లిని ఇలా చూసుకునేవారున్నారా?.. వైరల్ వీడియో

Mother : ఈరోజుల్లో తల్లిని ఇలా చూసుకునేవారున్నారా?.. వైరల్ వీడియో

Mother : అమ్మ…! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో… ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం. కానీ ఇక్కడ ఓ కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు తమ నూతన గృహప్రవేశం రోజు మాతృమూర్తికి ఇచ్చిన గౌరవం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోను చూసిన అభినందించనివారు లేరు.
అపురూప స్వాగతం.. 
ఇటీవల ఆడపిల్ల పుట్టిందని, మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని సెలబ్రేట్‌ చేయడం చూస్తున్నాం. ఇటీవల ఓ అత్తింటివారు ఆడపిల్ల పుట్టిందని ఏకంగా హెలిక్యాప్టర్‌లో తీసుకొచ్చారు. అచ్చం అలాగే ఓ కొడుకు తన నూతన గృహ ప్రవేశానికి అమ్మను ఆహ్వానించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ దృశ్యం ఎక్కడిదో తెలియదు కానీ.. కొత్తగా ఇల్లు కట్టుకున్న కొడుకు తన ఉన్నతికి కారణమైన అమ్మకు నూతన గృహంలోకి అపూరూపంగా ఆహ్వానించాడు. అమ్మ ఇంటి గడప వద్దకు రాగానే మంగళహారతితో కోడలు స్వాగతం పలికింది. తర్వాత గడపలోనికి అడుగు పెట్టగానే చిన్న పిల్లలు కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు చిట్టిపాద ముద్రలు వేయించినట్టుగా.. అమ్మ పాద ముద్రలు వేయాలని కోరారు. ఆమె నిరాకరించడంతో కొడుకు, కోడలు, మనుమరాలు బతిమిలాడి మరీ ఒప్పించారు. నానమ్మ, మనుమరాలు కలిసి కుంకుమ నీళ్లు కలిపిన తాంబూలంలో పాదాలు ఉంచి అడుగులను వేశారు.
తండ్రి ఫొటోకు పూజలు.. 
ఇక తనకు జన్మనిచ్చిన తండ్రిని కూడా ఆ కొడుకు మర్చిపోలేదు. తండ్రి ఫొటో ఇంట్లో అడగు పెట్టేవారందరికీ కనిపించేలా ఎదురుగా అమర్చాడు. అక్కడి వరకు పూల పరిచి.. తల్లిని తీసుకెళ్లాడు. తన భర్త ఫొటోను చూసిన ఆ తల్లి కల్లలో ఆనందబాష్పాలు ఉబికి వచ్చాయి. భర్త ఫొటోకు నమస్కరించిన అమ్మ.. అక్కడి నుంచి పూల బాటలో నడుస్తూ.. అమ్మవారి ఫొటో దగ్గరకు వెళ్లింది. అక్కడ అమ్మవారికి నమస్కరించి కొడుకు ఇంట్లో తనకు లభించిన అపురూప స్వాగతానికి, అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు ఉబ్బితబ్బిబయింది.
రెక్కలొచ్చి జీవితంలో స్థిరపడగానే.. తల్లిదండ్రుల నుంచి విడీపోయి దూరంగా ఉంటున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో, తల్లిదండ్రులను భారంగా భావించి మలి వయసులో ఆనాథాశ్రమాల్లో ఉంచుతున్న కొడుకులు ఉన్న ఈ కాలంలో ఈ కొడుకు తల్లికి పలికిన స్వాగతం, ఆమెకు ఇచ్చిన గౌరవానికి అందరూ ఫిదా అవుతున్నారు. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియోను చాలా మంది వాట్సాప్‌ స్టేటస్‌గానూ పెట్టుకుంటున్నారు. అయితే వాట్సాప్‌ స్టేటస్‌తో ఆగిపోకుండా.. ఉన్నంతలో తల్లిదండ్రులకు తగిన గౌరవం ఇచ్చి.. కడుపు నిండా అన్నం పెడితే అంతకన్నా వారు కోరుకునేది ఏమీ ఉండదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular