
Y S Bharati: ఆంధ్రప్రదేశ్‌కు మహిళ సీఎం కానున్నారా.. తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు నిదర్శనమా అంటే అధికార వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలు.. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న చర్చల మధ్య వైఎస్.భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసుతోపాటు, వివేకా హత్యకేసులో ఎటమటమైతే జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. అందుకే తన భార్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించబోతున్నారని తెలుస్తోంది.
జమ్మలమడుగు నుంచి పోటీ..
జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి చాలా ప్రతిష్టాత్మకమైంది. కడప స్టీల్ ప్లాంట్‌ను జగన్ ఇక్కడే పెట్టిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలిచినా మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసారి టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో ఉన్నా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీలోనే ఉన్న రామసుబ్బారెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. జమ్మలమడుగు నుంచి అయితే ఆది నారాయణరెడ్డి లేకపోతే రామసుబ్బారెడ్డి అన్నట్లుగా రాజకీయం నడిచేది. కానీ ఇద్దర్నీ కాదని గత ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి లైన్ క్లియర్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అంతగా సీరియస్‌గా తీసుకోవాల్సిన నేతగా వైసీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల జగన్ తన పార్టీ కూడా తనకు కాకుండా పోతుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే శాశ్వత అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్నారు. ఏదో జరుగుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా భారతిని ఎమ్మెల్యేను చేయడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు.

సునీత కుటుంబం యాక్టివ్ అయితే..
2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి వైఎస్.వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేయవచ్చన ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో ఈ కేసు జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అక్రమాస్తుల కేసులు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్నీ ఆలోచించే జగన్ తన భార్య భారతిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.