WhatsApp DP: వాట్సప్ డీపీ పెట్టినా తప్పేనా? సైబర్ చట్టం ఏం చెబుతోంది?

వాళ్ళిద్దరూ స్నేహితురాళ్ళు. ఎక్కడికైనా వెళ్తే సరదాగా సెల్ఫీలు దిగి వాట్సప్ డీపీలుగా పెట్టుకునేవారు. వారి స్నేహాన్ని చాటుకునేవారు. ఆ ఫోటోలను చూసి మిగతావారు మెచ్చుకుంటుంటే మురిసిపోయేవారు.

Written By: K.R, Updated On : September 9, 2023 9:25 am

WhatsApp DP

Follow us on

WhatsApp DP: సామాజిక మధ్యమాలవాడకం పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ఫోన్ అనేది ఒక ఖచ్చితమైన వస్తువు అయిపోయింది. మంచి వెనుకా చెడు ఉన్నట్టు.. ఇటువంటి స్మార్ట్ఫోన్ వినియోగంలో కూడా చెడు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి అంతర్లీనంగా పెరిగిపోయి కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అయితే దారుణాతి దారుణాలకు కారణమవుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు సంఘటనలు స్మార్ట్ ఫోన్ల వినియోగం పై సరైన పట్టు లేకపోతే ఎంతటి అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందో సభ్య సమాజానికి పరిచయం చేశాయి.

వాళ్ళిద్దరూ స్నేహితురాళ్ళు. ఎక్కడికైనా వెళ్తే సరదాగా సెల్ఫీలు దిగి వాట్సప్ డీపీలుగా పెట్టుకునేవారు. వారి స్నేహాన్ని చాటుకునేవారు. ఆ ఫోటోలను చూసి మిగతావారు మెచ్చుకుంటుంటే మురిసిపోయేవారు. అవే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారాయి. సరదాగా దిగిన సెల్ఫీలను కొంతమంది దుర్మార్గులు మార్ఫింగ్ చేశారు. బెదిరించారు.. సున్నిత మనస్కులైన ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగింది.

ఆమె పేరు రజిత (పేరు మార్చాం). రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది. ఆమెకు ఒక కుమారుడు కూడా. కళాశాలలో చదువుతున్నప్పుడు తన ప్రేమను కాదని.. మరొక యువకుడిని పెళ్లి చేసుకుందని పగబడ్డాడు ఓ వ్యక్తి. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలను ఎడిట్ చేసి అశ్లీల వీడియోలు రూపొందించాడు. అశ్లీల వెబ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలిసి ఆ యువతీ భర్త విడాకులు ఇవ్వాలని ఆమెకు నోటీసు పంపాడు. కుంగుబాటుకు గురైన ఆత్మహత్యకు యత్నించింది. ఇటీవల ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటి ఘటనలు కోకొల్లలు. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. పరువు పోతుందన్న భయం, భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన.. బాధితులను ప్రాణాలు తీసుకునేలా చేస్తోంది.. మరి ఇలాంటి పరిస్థితి మనకే ఎదురైతే ఏం చేయాలంటే.. మీ వ్యక్తిగత ఫోటోలు మా దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వండి ఎవరైనా అడిగితే?.. మా మాట వినకపోతే మీ నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని అనే బెదిరింపులు వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అవతలి వారు మిమ్మల్ని చెడ్డ వ్యక్తి లాగా చూపించాలనుకున్నా.. ఎవరూ తొందరపడి నమ్మేయరు. బెంబేలెత్తి పోవడం వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని మరింత బలహీనురాలుగా లెక్కేసే ప్రమాదం ఉంది. ముందుగా ఈ సమస్యను కుటుంబ సభ్యులకు తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. నిందితులపై ఐపిసి 384, 503, 292 కింద కేసు నమోదు చేయవచ్చు. మీకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను రాష్ట్ర లేదా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మీరు ఉంటున్న ఇంట్లోనే మీకు తెలియకుండా హిడెన్ కెమెరాలతో చిత్రీకరించినా.. ఫోటోలను, వీడియోలను బయటపెడతామంటూ బెదిరించినా ఐటీ యాక్ట్_2000 ప్రకారం 66(ఇ), 67, 67(ఎ) కింద వారిపై కేసు నమోదు చేయించవచ్చు. మీ ఫోటోలను, వీడియోలను మార్చి అత్యంత అభ్యంతరకరంగా ఏవైనా వెబ్ సైట్ లేదా సామాజిక మాధ్యమా ఖాతాల్లో చేర్చాలని తెలిస్తే.. అవి మరింత వ్యాప్తి చెందకుండా చూడమని కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. మీ ఫేక్ ఫోటోలను వెబ్సైట్లో చూస్తే వాటిని తీసేయమని ఆ మాస్టర్ లేదా గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలను సంప్రదించవచ్చు. అంతర్జాల వేదికగా జరిగే వేధింపులను ఎదుర్కొనేందుకు cyber crime. gov.in సాయం చేస్తుంది. మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫోటోలను పలు వెబ్సైట్ లూ, సామాజిక ఖాతాలో ప్రచురిస్తే వాటిని తొలగించేందుకు stop ncii.org వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆయా వెబ్ సైట్లలోకి వెళ్లి సంబంధిత వివరాలను నమోదు చేస్తే చాలు.. వాటిని ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఏ మూలన ఉన్న పట్టి తొలగించేస్తారు.