International Yoga Day 2025: విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షలాదిమంది ఒకేసారి యోగాసనాలు వేశారు. సరికొత్త రికార్డు సృష్టించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు యోగాసనాలు వేశారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు ప్రధాని మోడీకి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి జ్ఞాపిక అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం వేకువ జాము నుంచే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యోగాసకులు చేరుకున్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పదివేలకు పైగా వాహనాలు రాగా.. దాదాపు ఓ 30 చోట్ల పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Also Read: ప్రపంచ యోగా దినోత్సవం: మోడీ, చంద్రబాబు, పవన్ లు ఏమన్నారంటే?
పదివేల మందికి పైగా పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. సాగరనగరంలో ఎటు చూసినా యోగ సందడి కనిపించింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేలాది మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేస్తారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుమేరకు యువత అధికంగా యోగా దినోత్సవం లో పాల్గొన్నారు.

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చాలా రోజులుగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆ సమయంలోనే విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను హాజరుకానున్నట్లు చెప్పుకొచ్చారు. అది మొదలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ వచ్చింది. అయితే కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకుంది విశాఖలోని యోగా దినోత్సవం.