International Yoga Day 2025: విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. లక్షలాది మందితో ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా విశాఖ చర్చకు వచ్చింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేయగలిగామని.. ఆధునిక పరిశోధనల ద్వారా యోగశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసామన్నారు. యోగాతో ప్రపంచం శక్తివంతం అవుతుందని కూడా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. యోగ ఆధారాల విద్యా విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఈ విషయంలో ముందడుగు వేసినట్లు చెప్పారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా గృహత్వాన్ని సాధించడానికి యోగ కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయం పరిశోధనలో తేలింది అన్నారు. యోగ ఫర్ వన్ ఎర్త్, ఫర్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ఈ భూమండలంపై నివసించే ప్రతి ప్రాణికి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుందని.. అది మానవ శ్రేయస్సుకు దోహదపడుతుందని మోడీ చెప్పుకొచ్చారు. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యోగా చేయడం అనేది గొప్ప విషయం అన్నారు. చివరకు దివ్యాంగులు కూడా బ్రెయిలీలో యోగా శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో యోగా ఒలింపియాడ్లలో యువకులు విస్తృతంగా పాల్గొంటున్నారని.. దీనిని బట్టి చూస్తే ఆరోగ్య భారత్ ను సాధించడం ఎంతో దూరంలో లేదని అన్నారు. యోగాతో శాంతి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. యోగా ఫర్ ఆల్ అనే నినాదం భారత్ నుంచి వినిపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. యోగాకు ఎటువంటి సరిహద్దులు లేవని కూడా తేల్చి చెప్పారు.
Also Read: యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు చేయాలి?
* విజనరీ ప్రైమ్ మినిస్టర్ మోడీ
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. విజినరీ ప్రైమ్ మినిస్టర్ అంటూ కొనియాడారు. ప్రపంచం మొత్తానికి యోగాను పరిచయం చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నడుస్తోందన్నారు. 13 లక్షల కు పైగా ప్రదేశాల్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేస్తున్నారంటే దానికి కారణం ప్రధాని అని తేల్చి చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా 1.44 కోట్ల మందికి యోగాలో శిక్షణ విషయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్స్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని ప్రధాని మోడీని సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

* భారతావనికి గొప్ప వరం
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప వరంగా అభివర్ణించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నట్లు ప్రకటించారు. యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే.. ప్రధాని మోదీ దానిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోడీదేనని తేల్చి చెప్పారు. యోగ సాధకులు ఎంతటి దృఢచిత్రంతో ఉంటారనే దానికి.. ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి మోడీ నిలువెత్తు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదాన్ని ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లాలని ఆకాంక్షించారు.

