https://oktelugu.com/

International Women’s Day 2024: ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు? ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?

లింగ సమానత్వం, హక్కులపై పోరాటం, సామాజిక గుర్తింపు.. వీటన్నిటిపై ఉద్యమించాలని.. వాటి సాధన కోసం కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని మహిళా దినోత్సవం రోజు గుర్తు చేసుకుంటారు.

Written By: , Updated On : March 8, 2024 / 11:24 AM IST
International Women's Day 2024

International Women's Day 2024

Follow us on

International Women’s Day 2024: ఒక పురుషుడి జీవితంలో సగభాగం ఆమెదే. ఒక మగాడి విజయం వెనుక అసలు సిసలైన పాత్ర ఆమెదే. కూతురిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లెలిగా, అక్కగా, ఇంటిని పర్యవేక్షించే పెద్దమనిషిగా, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగినిగా.. ఇలా బహుముఖ పాత్రలు పోషిస్తుంది కాబట్టే మహిళలను మనం గౌరవించుకోవాలి. సమాజ అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో ఆమె పాత్ర సామాన్యం కాబట్టే ఆమెను మనం గౌరవం ఇవ్వాలి. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు.

లింగ సమానత్వం, హక్కులపై పోరాటం

లింగ సమానత్వం, హక్కులపై పోరాటం, సామాజిక గుర్తింపు.. వీటన్నిటిపై ఉద్యమించాలని.. వాటి సాధన కోసం కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని మహిళా దినోత్సవం రోజు గుర్తు చేసుకుంటారు. మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిని గుర్తించి సన్మానించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే సభలో, సమావేశాలలో మహిళలు ఇంట్లో, బయట ఎదుర్కొనే సమస్యలు తెరపైకి వస్తాయి. లింగ సమానత్వం, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపుల నిరోధం, మహిళలకు సమాన హక్కులు కల్పించడం వంటివి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడంలో కీలకమైన ఉద్దేశాలు. ఈ ఏడాదికి సంబంధించి “ఇన్ స్పైర్ ఇన్ క్లూజన్ ” నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఎందుకు ఈ రోజునే అంటే..

అమెరికాలోని న్యూయార్క్ నగర వీధుల్లో 1908లో తమ హక్కుల కోసం వేలాదిమంది మహిళా కార్మికులు వీరోచిత పోరాటం చేశారు. దానికి గుర్తుగానే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. నాడు క్లారా జెట్కిన్ అనే మహిళ సుమారు 15 వేల మంది మహిళల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశారు. తమకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.. కఠినమైన పనిగంటలు, తక్కువ వేతనాన్ని నిరసిస్తూ వారు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ మహిళలు చేసిన పోరాటం ఫలితంగా ప్రభుత్వాలు దిగివచ్చి వారందరికీ అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాయి. ఆ మహిళలు సాగించిన పోరాటానికి గుర్తుగా 1909 ఫిబ్రవరి 28 అమెరికాలో తొలిసారి మహిళా దినోత్సవం నిర్వహించారు.. 1909లో అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. ఇక 1917 లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో.. ఆ రక్తపాతాన్ని నిరసిస్తూ రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం ఫలితంగా రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ మహిళలు చేసిన ఉద్యమం ఫలితంగా వారికి ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరప్ దేశంలోని మహిళలు మార్చి 8న శాంతి ఈ కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.