Vizag Taj Mahal: భారతదేశంలో ఉన్న అందమైన కట్టడం తాజ్ మహల్. ప్రపంచంలోని గుర్తింపు పొందిన కట్టడాల్లో ఇది నిలిచింది. దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు తాజ్ మహల్ ను చూడడానికి వస్తూ ఉంటారు. షాజహాన్ తన ప్రేయసి కోసం కట్టించిన తాజ్ మహల్ ను ప్రభుత్వం సైతం అపురూంగా చూసుకుంటోంది. భారత్ లో తాజ్ మహల్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో అనేక అందమైన కట్టడాలు ఉన్నాయి. కానీ తాజ్ మహల్ అని పిలిచే నిర్మాణం మన వైజాగ్ లో ఉంది. నగర బీచ్ కు సమీపంలోనే ఉన్న దీని గురించి చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇది కూడా ప్రేమకు చిహ్నంగానే నిర్మించబడింది. ఇంతకీ ఆ స్టోరీ వివరాల్లోకి వెళితే.
భారత్ లో మొఘలలు పాలిస్తున్న రోజులవి. వైజాగ్ ప్రాంతంలో కురుపాం అనే జమిందార్లు ఉండేవారు. వీరిలో రాజా వైరిచెర్ల వీరభద్ర బహదూర్ ఉండేవారు. ఈయనకు అనకాపల్లి జమీందారు గోడే నారాయణ గజపతిరావు రెండో కుమార్తె రాణి లక్ష్మీ నరస్సాయమ్మ పట్టమహదేవిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి 1895లో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడేళ్లకే లక్ష్మీ నరస్సాయమ్మ మరణించారు. ఆమె మరణాన్ని వీరభద్ర బహదూర్ తట్టుకోలేకపోయారు. తన ముగ్గురు పిల్లలతో ఎంతో బాధపడేవారు. అయితే ఆమె గుర్తులు ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో ఆమె పేరుతో ఓ కట్టడాన్ని నిర్మించారు.
దీంతో వైజాగ్ సమీపంలో మొఘలుల కట్టడాల తరహాలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని అందరూ వైజాగ్ తాజ్ మహల్ అని చెప్పుకుంటున్నారు. రాజా బహదూర్ తన భార్యను మరిచిపోలేక దీనిని నిర్మించినందుకు ఇది కూడా ప్రేమకు చిహ్నమే అని అంటున్నారు. అయితే రాజా బహదూర్ దీనికి ‘ప్రేమ నివేదన రూపం’ అని పేరుపెట్టారు. అంతేకాకుండా ఆమెను గుర్తు చేసుకుంటూ ఇందులోని మరణించే వరకు గడిపారు. ఈ నిర్మాణంలో దేశంలోని అన్ని సంస్కృతులు కనిపించేలా తయారు చేశారు. ఇందులో రాణి గాని విగ్రహం కూడా ఉండేది. కానీ 30 ఏళ్ల కిందట కొందరు ఆ విగ్రహాన్ని దొంగిలించారు.
విశాఖ బీచ్ కు దగ్గరగా ఉన్న దీని గురించి ఎవరూ ప్రచారం చేయడం లేదు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది. అయితే పూర్తిగా శిథిలంగా మారుతూ చెట్లు పెరిగాయి. అంతేకాకుండా చుట్టూ బిల్డింగుల నిర్మాణం జరగడంతో ఇది కనిపించకుండా పోయింది. దీంతో పర్యాటకుల సంఖ్య ఇక్కడికి తక్కువగానే ఉంటుంది. కానీ లవ్ కపుల్స్ మాత్రం ఇక్కడికి సందర్శిస్తుంటారు. కొందరు వెడ్డింగ్ ఫొటో షూట్ వాళ్లూ కూడా వస్తున్నారు. అయితే దీనిని కూడా గుర్తించి పర్యాటక ప్రదేశంగా మార్చాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు.