
Shivvaram Crocodile Park: గలగల పారే గోదావరి.. కనుచూపు మేర నీటిప్రవాహం.. చుట్టూ పచ్చని చెట్లు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయం.. ఏడాది పొడవునా జలకళతో ఉండే నదిలో వెలసిన ప్రకృతి సిద్ధమైన నీటిమడుగు.. నది ఒడ్డున ఆనుకుని ఉండే ఎతై ్తన గుట్టలు. ఇదంతా ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లాలోని జైపూరు మండలం శివ్వారం అభయారణ్యంలోని మొసళ్ల మడుగు కేంద్రం ప్రత్యేకత.. అందమైన అడవుల్లో అదో మడుగు. అద్వితీయమైన అందం. ఆశ్చర్యపరిచే జీవజాలానికి అది చిరునామా. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, శరవేగంగ నశించిపోతున్న మొసళ్లు, నీటి కుక్కలు, కృష్ణ జింకలు, నెమళ్లు, దుప్పులు, పందులు, ముళ్లపందులు ఆ మడుగు.. పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచ పటంలోనే శివ్వారం ఎల్.మడుగు పునరావాస కేంద్రం గుర్తించబడిందంటే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చరిత్ర…
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్న శివ్వారం మొసళ్ల మడుగు ఎంతో పురాతనమైంది. కాకతీయరాజుల కాలం నుంచే దీనికి పేరుంది. కాకతీయులు వరంగల్ నుంచి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) మంథని నుంచి శివ్వారం మీదుగా చెన్నూరుకు రహదారిని ఏర్పాటు చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పట్లో మునీశ్వరులు నివాసాలు ఏర్పరుచుకొని ఈప్రాంతంలో నివసించేవారని చెబుతారు. ఇక్కడి సువిశాల ప్రదేశంలో గోదావరినది, దట్టమైన అటవీప్రాంతం, గుట్టలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. జైపూరు మండలం కుందారం నుంచి చెన్నూరు మండలం బీరెల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర గోదావరినది విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మొసళ్ల మడుగు కేంద్రంగా అటవీశాఖ గుర్తించింది.
1978లో అధ్యయనం..
పుష్పకుమార్ అనే వైల్డ్‌లైఫ్ నిపుణుడు ఈప్రాంతాన్ని 1978లో సందర్శించాడు. అప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడై ఈప్రాంతంలోని అభయారణ్యం, జీవజాతులపై అధ్యయనం చేశాడు. అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈప్రాంతాన్ని మొసళ్ల పునరావాస కేంద్రంగా ప్రకటించింది. అప్పటి నుంచి మొసళ్లను అటవీశాఖ ఆధ్వర్యంలో సంరక్షిస్తున్నారు. మడుగులో సుమారు 60కి పైగా మంచినీటి, ఉప్పునీటి మొసళ్లు ఉన్నాయి. వర్షాకాలంలో మొసళ్లు సమీపంలో ఉన్న పంటపొలాల్లోకి సైతం వస్తాయి.
అభయారణ్యంలో అనేక జీవజాతులు
శివ్వారం అభయారణ్యం అనేక వృక్ష, జంతు జాతులకు నిలయం. చుక్కల దుప్పులు, నీలుగాయిలు, ఇప్ప పిల్లులు, అడవిపందులు, ముళ్ల పందులు, జింకలు, కొండగొర్రెలు, నీటి కుక్కలు, తదితర జంతుజాతులు ఈ అభయారణ్యంలో నివసిస్తున్నాయి. నల్లమద్ది, తిర్మణి, చెన్నెంగ, ఏగీస, బూరగ, అందుగు, సిందుగు, కొడిశ, పాల అరుదైన వృక్షజాతులున్నాయి. మొసళ్ల సంరక్షణతోపాటు వృక్ష, జంతువుల రక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గుట్టపై పురాతన ఆలయాలు..
శివ్వారం నుంచి మడుగుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పర్యాటక స్థలంగా తీర్చిదిద్దితే ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. శివ్వారం అటవీ ప్రాంతంలోని మొసళ్ల కేంద్రం ప్రాంతంలో గుట్టలపైన పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కోమటి మడిగెలు అనే గుహలకు ఎంతో చారిత్రాత్మక ప్రధాన్యత ఉంది . ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగాలు పూర్తిగా శిథిలమయ్యాయి. చారిత్రక ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వాటి చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా ప్రభుత్వం కాపాడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
వీక్షించేలా.. వాచ్‌టవర్..
శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం(ఎల్‌మడుగు)ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అటవీ శాఖ అధికారులు చెపుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఏడాది కిందట అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో వాచ్‌టవర్ నిర్మించారు. గుట్టపైన ఏర్పాటు చేసిన వాచ్‌టవర్ నుంచి ఇక్కడి ప్రకృతి అందాలను, మొసళ్ల మడుగును వీక్షించవచ్చు. గుట్ట కిందిభాగంలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. గోదావరి తీరం నుంచి అక్రమ కలపరవాణా నివారణ కోసం మరపడవను కొనుగోలు చేశారు. మరో మరపడవను బోటింగ్ కోసం కేటాయిస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు

జీవ వైవిధ్యానికి నెలవు..
జీవవైవిద్య వెబ్‌సైట్‌లోనూ ఎల్.మడుగు విశిష్టత పొందుపర్చి ఉంది. అయినా ఈ ప్రాంతాన్ని తన పరిధిలోకి తీసుకోవాల్సిన పర్యాటక శాఖ సైతం ఎందుకు విస్మరించిందో తెలియక అటవీ శాఖ అధికారులూ తలలు పట్టుకుంటున్నారు. ఏటా నామమాత్రంగా రూ.4 లక్షలు మాత్రమే విడుదల చేస్తూ.. చేతులు దులుపుకుంటోంది.
ఇలా రావాలి..
హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు మార్గం ద్వారా రావొచ్చు. రోడ్డు మార్గంలో రాజీవ్ రహదారి మీదుగా గోదావరిఖనికి చేరుకుని అక్కడి నుంచి ఇందారం మీదుగా శివ్వారం ఎల్ మడుగు వరకు వెళ్లొచ్చు. ఇక రైళ్లో వచ్చేవారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి గోదావరిఖని బస్సులో ప్రయాణిస్తే మార్గ మధ్యంలోనే ఇందారం వస్తుంది. అక్కడి నుంచి శివ్వారం ఎల్ మడుగుకు చేరుకోవచ్చు.