Death Valley: 50 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ హ్యాపీగా ప్రజలు.. ఎక్కడంటే?

డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. ఇది ఒక ఎడారి ప్రాంతం. కాలిఫోర్నియాలోని గ్రేట్ బేసిన్ ఎడారి సరిహద్దులో ఉన్న ఒక ఎడారి లోయ.

Written By: Dharma, Updated On : February 21, 2024 5:09 pm

Death Valley

Follow us on

Death Valley: వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఒకసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరోసారి తగ్గుముఖం పడతాయి. ఒక్కోసారి విపరీతమైనచల్లటి వాతావరణం ఉంటుంది.చలి తీవ్రత అధికంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు బట్టి ఇది ప్రభావం చూపుతుంటాయి. అయితే ప్రపంచంలో అత్యధిక వేడి ఉండే ప్రాంతం ఒకటి ఉంది. కానీ అందరూ అనుకుంటారు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఏదో ఆఫ్రికా దేశం అని. కానీ వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం ఆఫ్రికాలో లేదు.. అమెరికాలో ఉంది. దాని పేరు డెత్ వ్యాలీ. ఇది భూమిపై అత్యంత వేడి ప్రదేశంగా గుర్తింపు పొందింది.

డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. ఇది ఒక ఎడారి ప్రాంతం. కాలిఫోర్నియాలోని గ్రేట్ బేసిన్ ఎడారి సరిహద్దులో ఉన్న ఒక ఎడారి లోయ. ఇది భూమిపై అత్యంత వేడి ప్రదేశంగా గుర్తింపు సాధించింది. నిత్యం ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. 1913లో రికార్డు స్థాయిలో 57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వేసవి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం భగ్గుమంటుంది. 49 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. 1996లో అయితే ఏకంగా 40 రోజుల పాటు 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

ఇంతటి వేడి ప్రాంతంలో సైతం కొంతమంది అక్కడ నివసిస్తుండడం విశేషం. స్థానిక అమెరికన్ల టీంభిషా తెగ ఇక్కడ నివాసం ఉంటుంది. వారి ఊరు డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ మధ్యలో ఫర్నేస్ క్రీక్ లో ఉంటుంది. వేసవిలో ప్రమాదకరంగా ఉష్ణోగ్రతలు ఉన్న అక్కడ ప్రజలు అదే ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడడం ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి వేడి వాతావరణం లో కూడా అక్కడ వృక్షాలు, జంతువులు ఉనికి చాటుకోవడం విశేషం. కుందేళ్లు, ఎలుకలు, జింకలు, ఉడతలు వంటివి తారస పడతాయి. రకరకాల చెట్లు దర్శనమిస్తాయి. పాములు, తేళ్లు, బల్లులను కూడా చూడవచ్చు.

డెత్ వ్యాలీ ప్రాంతం సముద్రమట్టానికి 282 అడుగుల ఉంటుంది. అందుకే ఇది ఉత్తర అమెరికాలో అతి తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ సమయంలో ఈ లోయకు ఆ పేరు వచ్చింది. 1849లో కాలిఫోర్నియాలోని గోల్డ్ మైన్స్ కు వెళ్లడానికి ఈ లోయను దాటేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో దాహంతో అలమటించి 13 మంది చనిపోయారు. మిగతావారు వెనక్కి వచ్చేశారు. దీంతో అప్పటినుంచి ఆ ప్రాంతానికి డెత్ వ్యాలీ అని పేరు పెట్టారు.