Minister Gummanur Jayaram: వైసిపి హై కమాండ్ పై అసంతృప్తిగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ ఆయనను ఆలూరు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇస్తే ఆలూరు అసెంబ్లీ స్థానం ఇవ్వండి.. లేకుంటే తాను ఎంపీగా పోటీ చేయనంటూ గుమ్మనూరు జయరాం తేల్చి చెప్పారు. దీంతో కర్నూలు ఎంపీ స్థానానికి వేరే నేతకు ఎంపిక చేశారు. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశానికి హాజరైన జయరాం.. రాప్తాడు సిద్ధం సభకు ముఖం చాటేశారు. దీంతో ఆయన వైసీపీలో ఉండరని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీలో చేరతారని అంతా భావిస్తున్నారు.
గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు.తెలుగుదేశం పార్టీలో జడ్పిటిసి గా ఉండేవారు. వైసీపీలోకి మారిన తరువాత ఆలూరు టికెట్ను దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విస్తరణలో సైతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రుల్లో గుమ్మనూరు జయరాం ఒకరు.అయితే ఈసారి ఆలూరు టికెట్ ఇవ్వలేనని..కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు. కానీ జయరాం అందుకు ఒప్పుకోలేదు.మూడు రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గుమ్మనూరు జయరాం పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న చర్చ నడిచింది. కానీ మొన్నటి మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడంతో ఆయన వైసీపీలోనే ఉంటారని అంతా భావించారు.
రాప్తాడు లో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం గైర్హాజరు కావడంతో.. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. జయరాం కు అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 23న పార్టీకి, పదవికి రాజీనామా చేసి టిడిపి కండువా కప్పుకుంటారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. కాటసాని బ్రదర్స్ ను ఓడించడమే తన లక్ష్యమని జయరాం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాటసాని బ్రదర్స్ లో ఒకరైన వెంకట్రామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో జయరాం గుంతకల్లు మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆలూరు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు బరిలో దిగే ఛాన్స్ ఉంది.