Inspirational Women : ఒక వయసు దాటిన తర్వాత ఎవరికైనా సరే ఆసక్తి తగ్గుతుంది. జిజ్ఞాస సడలి పోతుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈమె అందరికంటే భిన్నం. ఈమె ఆలోచనా విధానమూ భిన్నం. అందు గురించే ఈమె వార్తల్లో వ్యక్తి అయింది. ఏకంగా జాతీయ మీడియాలోనే ప్రధాన వార్త అయింది. ఇంతకీ ఈమె ఏం సాధించింది అంటే..
58 ఏళ్ల వయసులో..
ఆమె పేరు సువర్ణ వినాయక్ పవార్. సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఆమె నివాసం ఉంది. ఈమెకు 19 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. అయితే పెద్దలు వివాహం నిర్ణయించడంతో చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వివాహం జరగడం.. ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం వంటివి జరిపోయాయి. ఆ తర్వాత మళ్లీ చదువును కొనసాగించాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. ఈలోగా కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడంతో ఆమె చదువు మీద మనసును లగ్నం చేయలేని పరిస్థితి ఏర్పడింది.. చివరికి ఆమె కల 39 సంవత్సరాల తర్వాత నెరవేరింది. 58 సంవత్సరాల వయసులో ఆమె ఇంటర్ పాస్ అయింది. అంతేకాదు 58 సంవత్సరాల వయసులో ఇంటర్ పాసై.. సరికొత్త రికార్డు సృష్టించింది సువర్ణ.. సువర్ణ పెళ్లికి ముందే 10 పాస్ అయింది. ఆమెకు ఉన్న విద్యార్హతను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ప్రభుత్వం 2010లో అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం ఇచ్చింది. అయితే ఆమెకు అంగన్వాడి టీచర్ గా పని చేయాలన్నది ఎప్పటినుంచో కోరిక. దానికి ఇంటర్ కచ్చితంగా పాస్ అయి ఉండాలి. అందువల్లే ఓపెన్ ఇంటర్ కోర్సులో చేరిన సువర్ణ.. మొత్తంగా 58 సంవత్సరాల వయసులో ఇంటర్ పాస్ అయింది.
Also Read : కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోవచ్చు.. పట్నంలో కూడా సులభమే..
త్వరలో అంగన్వాడి టీచర్ గా..
ఇంటర్ లో 50.84 శాతం మార్కులతో ఆమె పాస్ అయింది. వాస్తవానికి ఇంటర్ పాస్ అవ్వడానికి ఆమె తన పిల్లల సహకారం కూడా తీసుకుంది. తనకు అర్థం కాని విషయాలను కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునేది. దీనికోసం రేయింబవళ్లు కష్టపడేది. పుస్తకాలతో నిత్యం కుస్తీ పట్టేది. చివరికి ఇంటర్ పూర్తి చేసి.. తను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఆమె ఇంటర్ పాస్ అయింది కాబట్టి.. అంగన్వాడి టీచర్ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.. అయితే 58 సంవత్సరాల వయసులో ఆమెకు ఆ ఉద్యోగం ఇస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఆమె ఇంటర్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు..” మా అమ్మ ఎంతో కష్టపడింది. చదువును ఇష్టంగా పూర్తి చేసింది. చివరికి 50.84 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయింది. ఇప్పుడు ఓపెన్ డిగ్రీలో కూడా ప్రవేశం తీసుకుంది. త్వరలో ఆమె డిగ్రీ కూడా పూర్తి చేయనుంది. ఒకప్పుడు మా అమ్మ చదువుకోవాలంటే ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండేది కాదు. ఇప్పుడు మేం పెద్దవాళ్ళమయ్యాం.. జీవితంలో స్థిరపడే వయసుకు వచ్చాం. అందువల్లే మా అమ్మ తిరిగి చదువుపై దృష్టి సారించింది. చదువు మీద మనసు లగ్నం చేసి.. మొత్తానికి ఇంటర్ పాస్ అయింది. కష్టపడే తత్వం మా అమ్మలో అణువణువు ఉంది. అందువల్లే ఇక్కడిదాకా ప్రయాణం సాగించగలిగిందని” సువర్ణ పిల్లలు చెబుతున్నారు.