Homeజాతీయ వార్తలుKCR Birthday Special Story: సిద్దిపేట నుంచి ఢిల్లీ సింహాసనం వైపు.. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం

KCR Birthday Special Story: సిద్దిపేట నుంచి ఢిల్లీ సింహాసనం వైపు.. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం

KCR Birthday Special Story
KCR Birthday Special Story

KCR Birthday Special Story: ‘గీ బక్కోడు తెలంగాణ తెస్తడా.. పెద్దపెద్ద ఉద్ధండులు కొట్లాడితేనే రాలేదు. ఇగ బక్కోడు కొట్లాడి తెలంగాణ తెస్తడట’

‘తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా కౌగిలించుకుంటం. మాకు బేషజాలు లేవు. ప్రత్యేక రాష్ట్రం కోసం అందరినీ కలుస్తం.. కలుపుకుపోతం’

‘తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తం. టీఆర్‌ఎస్‌ పుట్టిందే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం. అది నెరవేరినంక పార్టీ లక్ష్యం నెరవేరినట్టే’

‘తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆమె పట్టుదలతో ఉన్నారు కాబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమనే కల నిజమైంది. నేను మనస్ఫూర్తిగా ఆమెకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’

‘తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తం’
‘కేసీఆర్‌ మాటిస్తే తప్పడు.. మాట తప్పాల్సిన పరిస్థితి వస్తే తల నరుక్కుంటడు’

‘తెలంగాణకు స్వీయ రాజకీయ ప్రకటన కావాలి. ఉద్యమ పార్టీని కాంగ్రెస్‌లో ఎలా కలిపేస్తారని నన్ను ప్రజలు అడుగుతున్నారు. ఉద్యమానికి నేను కాపలాగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా నేనే నాయకత్వం వహిస్తాను’

ఈ మాటలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పినవే.. విజయ గర్వంతో విర్రవీగినా.. అణకువతో మాట్లాడినా ఆయనకే చెల్లుతుంది. చెల్లుబాటు అయ్యేలా మాట్లాడతారు కూడా.

మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో కేసీఆర్‌ది అనితరసాధ్యమైన శైలి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రసంగకళకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, మాటకు కట్టుబడి ఉండకపోవడం ఇప్పటి రాజకీయాల్లో మామూలైపోయి ఉండవచ్చు. కానీ, ప్రజా జీవితంలో అది మరీ అంత మామూలైపోలేదు. ‘ఇచ్చిన మాట’కు ఇంకా ఒక సామాజిక విలువ కొనసాగుతూనే ఉంది. అయితే, రాజకీయాల్లో ప్రాసంగికతను పిడికిట్లో పట్టి ఔపోసన పట్టడంలో ఆరితేరిన ఈ నాయకుడు కల్వకుంట్లల చంద్రశేఖర్‌రావు. కేవలం తన మాటలతోనే యావత్‌ తెలంగాణ తెలంగాణ కోసం ఏకమైంది. సమష్టిగా ఉద్యమించింది. సబ్బండ వర్ణాలు పోరుబాట పట్టాయి. తెలంగాణ కళ సాకారమైన తర్వాత 2014లో 67 స్థానాలు, 2019లో 80కిపైగా స్థానాలు రావడానికి కూడా కేసీఆర్‌ వాక్‌చాతుర్యమే కారణం. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.

తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ తమది ఉద్యమ పార్టీ అని చెప్పిన కేసీఆర్‌ తర్వాత తమది ‘పక్కా పొలిటికల్‌ పార్టీ‘ అని ప్రకటించి ఉద్యమ నేపథ్యం మీద ఎన్నికల అజెండాను ఎగరేశారు. మేళతాళాలు, కళాకారుల విన్యాసాల నడుమ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కేసీఆర్, ఆ స్వాగత సందోహాన్నే కొన్ని నెలల్లో విజయోత్సవంగా మలచుకుని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

కాకతాళీయం కాదు..
రాజకీయాల్లో కాకతాళీయంగా ఏదీ జరగదు. అన్నీ పథకం ప్రకారం అమలు చేస్తేనే జరుగుతాయని అంటారు. ఈ సంగతి బాగా తెలిసిన లీడర్‌ కేసీఆర్‌. గాలి రాజకీయాలు చేసే మనిషి కాదు. సీరియస్‌ మనిషి. పరిస్థితులను అందాజ్‌ వేస్తారు. వ్యూహాలను నిర్ణయించిన తరువాత వాటిని నిష్కర్షగా అమలు చేస్తారు. ఇది బలమైన నాయకుడికి ఉండే లక్షణం. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడు.

ఓటమితో మొదలైన ప్రయాణం… ఓటమి ఎరుగని ప్రయాణం..
ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలి అన్నదే కేసీఆర్‌ నమ్మిన సూత్రం. మానేరు ఎగువ ఆనకట్ట నిర్మాణంలో భూమిని కోల్పోయి అప్పటి మెదక్‌ జిల్లాలోని చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడిన కల్వకుంట్ల రాఘవయ్య, వెంకటమ్మల కుమారుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పెద్దగా ధనిక కుటుంబమేమీ కాదు. కానీ, కాలేజీ రోజుల నుంచే నాయకత్వ స్థానాల్లోకి వెళ్లాలన్న కల కేసీఆర్‌ను వెంటాడేది. ఆ దిశగా ఆయన ప్రయాణం మొదట పరాజయాలతోనే మొదలైంది. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో ఆయన హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చదివారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ నేత అనంతుల మదన్‌మోహన్‌ శిష్యుడిగా ఉంటూ రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ‘మదన్‌ మోహన్‌ ఒకసారి కేసీఆర్‌కు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని ఆఫర్‌ చేశారు. దానికి ఆయన, ‘నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను’ అని చెప్పారు. భవిష్యత్తుపై ఆయనకు అంత క్లారిటీ ఉండేది అని 1970 నుంచి 1975 వరకు ఇంటర్, డిగ్రీ కాలేజీలో కేసీఆర్‌ సహాధ్యాయిగా ఉన్న కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి చెప్పారు.

కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రస్థానం..
డిగ్రీ పూర్తి కాగానే అసలు రాజకీయాలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలోనే జరుగుతున్నాయని భావించిన కేసీఆర్‌ ఎమర్జెన్సీ విధించిన ఏడాదే ఢిల్లీకి వెళ్లి సంజయ్‌ గాంధీ నాయకత్వంలోని యూత్‌ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌ గాంధీ ప్రమాదంలో చనిపోవడంతో 1980లో సిద్ధిపేటకు తిరిగి వచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి సిద్ధిపేట సభలకు వచ్చినప్పుడు యువ కేసీఆర్‌ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. ‘ఈ కుర్రాడు బాగా మాట్లాడుతున్నాడు. స్టేజీ మీద మాట్లాడనివ్వండి అని చెన్నారెడ్డి చెప్పేవారు.

ఎన్టీఆర్‌ అభిమానిగా.. తెలుగుదేశంలో చేరిక..
కేసీఆర్‌కు ఎన్టీఆర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్‌ చేసేవారు. ఈ క్రమంలో నందమూరి తారక రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్‌ ఆ పార్టీలో చేరారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తన రాజకీయ తొలి గురువు మదన్‌మోహన్‌ మీదే పోటీ చేసి కేవలం 877 వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో మళ్లీ టీడీపీ తరఫున బరిలోకి దిగి తన రాజకీయ జీవితంలో తొలి కీలక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్‌ వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయిదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1987లో ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1997లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్‌ పదవిని కట్టబెట్టారు. తనకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం కేసీఆర్‌కు నచ్చలేదు.

KCR Birthday Special Story
KCR Birthday Special Story

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
15 ఏళ్ల వయసులో తెలంగాణ తొలి ఉద్యమాన్ని చూసిన కేసీఆర్‌కు అది మళ్లీ రెక్క విప్పే సందర్భం వచ్చిందని గుర్తించారు. అప్పటికే మూడేళ్ల కిందట 1996లో అప్పటి ప్రధానమంత్రి హెచ్‌డీ.దేవెగౌడ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఉత్తరాఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే అవకాశం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు జోరందుకున్న సందర్భంలో పెరిగిన సీమాంధ్రుల వలసలతో తెలంగాణలో మళీల చలనం మొదలైంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌తోపాటు మరికొందరు అదే ఏడాది నవంబర్‌ 1న వరంగల్‌లోని ఒక చిన్న హాలులో సమావేశమైనప్పుడు, అనూహ్యంగా 5 వేల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాల పరంపర అలా మొదలై విస్తరిస్తూ వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలు పెంచినప్పుడు వెల్లువెత్తిన నిరసనలో భాగంగా కేసీఆర్‌ తన పార్టీ నేతకు బహిరంగ లేఖ రాశారు. అదే ఏడాది నవంబర్‌ నెలలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అసాధ్యమేమీ కాదనే నమ్మకం వేళ్లూనుకున్న ఆ దశలో మాజీ నక్సల్‌ నేత గాదె ఇన్నయ్య, జయశంకర్‌ వంటి తెలంగాణవాదులతో విస్తృతంగా చర్చలు జరిపిన కేసీఆర్‌ 2001, ఏప్రిల్‌ 7న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి రావడం ఆయన తన రాజకీయ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయం. కానీ, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నినాదం ఎత్తుకోవడం ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ అయింది.

తెలంగాణ ఉద్యమానికి కొత్త నేత
ఒక నిర్ణయం తీసుకునే ముందే దాని గురించి లోతుగా ఆలోచించడం కేసీఆర్‌ నైజం. ‘మొదటిసారి మంత్రి అయినప్పుడే ఆయన తన శాఖలో ప్రతీ దశలో ఉండే అధికారులతో విస్తతంగా చర్చించి, దాని స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చే ముందు సిద్ధిపేట నియోజకవర్గంలో తనకిక ఎప్పటికీ తిరుగుండదని నిర్థారించుకున్నారు. టీఆర్‌ఎస్‌ స్థాపనకు ముందు ఏడాది కాలానికి పైగా తెలంగాణకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తతంగా అధ్యయనం చేశారు. దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించినా ఆయన అలా ప్రతీ అడుగు శాస్త్రీయంగా ముందుకు వేస్తారు. పార్టీ స్థాపించిన ఇరవై రోజులకే 2001, మే 17న కేసీఆర్‌ కరీంనగర్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ సాధిస్తామని ఆయన ఆ సభలోనే ప్రకటించారు. రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తామన్నారు. ‘వేదిక మీద ఉన్నవారిలో ఎవరైనా ఈ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి’ అని ఆవేశంతో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం వాడిగా వేడిగా అప్పుడు మొదలైన కేసీఆర్‌ వాగ్ధాటి రాను రాను రాటుదేలిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని ఆవిష్కరించే యాస, భాషలతో సాగే కేసీఆర్‌ ప్రసంగాలకు తెలంగాణ ప్రజలు ముగ్ధులయ్యారు. రాజీనామాలు చేసి వచ్చిన ప్రతిసారీ ఆయనకు నీరాజనాలు పలికారు.

ప్రజల నాడి పట్టుకుని..
ప్రజల సమస్యలను నిశితంగా అర్థం చేసుకుని మళ్లీ వాటిని వారికే సులువైన మాటల్లో వినిపించడం కేసీఆర్‌ ప్రత్యేకత. అప్పుడు ప్రజలు ‘తమ సమస్యలను బాగా అర్థం చేసుకున్న నాయకుడే వాటిని తీర్చగలుగుతాడు’ అనే నమ్మకంతో ఆయన వెన్నంటి నడుస్తారు. అంతేకాదు, ఎంతో సంక్లిష్టమైన సమస్యలను మామూలు మాటల్లో చెప్పడం కేసీఆర్‌ లాగా మరెవరికీ సాధ్యం కాదు. ‘తెలంగాణ బతుకులు…. బొగ్గుబాయి, బొంబాయి.. దుబాయి అన్నట్లు తయారైనయ్‌ అంటారు. వంద వాక్యాలు చూపించలేని ప్రభావాన్ని ఆయన అలా మూడు మాటల్లో తేల్చేస్తారు. తెలంగాణలో కప్పుల్లా ఉన్న చెరువులు ఇప్పుడు సాసర్లలా మారినయ్‌ అంటారు. ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌లో ఆయన మాస్టర్‌. ఉద్యమకాలంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన వాక్చాతుర్యం ప్రజల్నీ, ప్రత్యర్థుల్నీ, మీడియానూ మురిపిస్తూనే ఉంది. భాషను ప్రేమించడమే కాదు, సంప్రదాయంలోని ఐడెంటిటీని ఆయన బాగా ఇష్టపడతారు. ‘ప్రజలే నా దేవుళ్లు’ అని తనను తాను వారి భక్తుడిగా అభివర్ణించుకున్న ఎన్టీఆర్‌ ఒక మాస్‌ లీడర్‌గా చరిత్రలో నిలిచిపోతే, కేసీఆర్‌ దానికి కాస్త భిన్నంగా, తెలంగాణ సమాజమే తన తల్లి అని అంటారు. ఆ తల్లి బిడ్డగా వచ్చానని ప్రజల మనసులకు చేరువయ్యారు.

సంక్షేమ పాలన..
ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రిగా మారిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించిన సమస్య విద్యుత్‌ కొరత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే అంధకారమే మిగులుతుందంటూ వచ్చిన విమర్శలను ఆయన సవాలుగా తీసుకుని 24 గంటల విద్యుత్‌ను అధికారంలోకి వచ్చిన తరువాత రెండో పంట నుంచే ఇచ్చారు. ఇంకా, శరవేగంగా కాళేశ్వరం పూర్తిచేశారు. సంక్షేమ పథకాలను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటివెలుగు, రైతు బంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలను కొందరు మెచ్చుకుంటున్నా, వాటిని విమర్శిస్తున్నవారు సామాన్య జనంలోనూ కనిపిస్తున్నారు.

‘పేదల పక్షాన నిలిచే పార్టీల నేతలుగా గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్సార్‌ వంటి నేతలకు గుర్తింపు లభించింది. ఇప్పుడు కేసీఆర్‌ ఆ జాబితాలో చేరారు. కుటుంబాలు ఒక్క గదిలో బతకడం ఏమిటి, కనీసం డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు ఉండాలన్న ఆయన ఆలోచన చాలా ఉదాత్తమైనదే. కానీ, ఆయనే వాటి నిర్మాణానికి గడువులు విధించుకోవడంతో అదొక వైఫల్యంగా మారింది.

సందేహాలు…
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో విద్యార్థి లోకం ఉద్యమంతో మమేకమైంది. కానీ, హామీ ఇచ్చిన లక్షకు పైగా ఉద్యోగాల నియమాకాలు జరగకపోవడం యువతరాన్ని నిరాశకు గురిచేసింది. ఉద్యమానికి ఉద్విగ్న కేంద్రంగా మారుమోగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ల పండగ వస్తే… ప్రభుత్వం కావాలనే పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. ‘విద్యార్థులపై కేసీఆర్‌ ప్రతీకార వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలా సంకుచితంగా ఉండడం న్యాయం కాదని‘ ఓయూ విద్యార్థులు అంటున్నారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రగతి భవన్‌కే పరిమితం కావడం ఏ వ్యవస్థకు సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో తనతో కలిసి నడిసిన కోదండరామ్‌ ఇంటి మీదకు అర్థరాత్రి పోలీసులను పంపించడం, ధర్నా చౌక్‌ను ఎత్తేయడం వంటి చర్యల ద్వారా ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరించారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవడం కాకుండా ఇంకేం సాధించారని ఆయనకు చాలా దగ్గరగా ఉన్నవారే వాపోతున్నారు.

మంత్రులు కూడా తమకు కేసీఆర్‌ ఆపాయింట్మెంట్‌ దొరకడం గగనమైపోయిందని దాదాపు బాహాటంగానే అంటున్న సంగతి కూడా కేసీఆర్‌కు వినిపించకుండా ఉంటుందా? ‘ఆయన పోలీసులు, ఇంటలిజెన్స్‌ వర్గాల మాట తప్ప మరెవరి మాటా వింటున్నట్లు లేదు. ఆయన తన పాలనలో, ప్రవర్తనలో తెలంగాణ సంస్కృతిని ప్రతిఫలించకుండా, తెలంగాణ సమాజం నిర్ద్వంద్వంగా నిరాకరించిన ఫ్యూడల్‌ సంస్కతిని ప్రతిబింబిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి..
ఇక తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్‌కు ఢిల్లీ పీఠం అధిష్టించాలన్న ఆశ పుట్టింది. అదీ సాధారణంగా కాదు.. కేంద్రంతో కయ్యం ఆయనలో ఆశ రేపింది. దీంతో ఆయన ప్రత్యామ్నాయ కూటమి అంటూ దేశ పర్యటన చేశారు. మద్దతు కోసం ప్రాంతీయ పార్టీల గడపలన్నీ తొక్కారు. కానీ, కేసీఆర్‌ను ఎవరూ నమ్మలేదు. ఉద్యమ నేతగా ఆయనకు ఉన్న గుర్తింపు, నమ్మకం 9 ఏళ్ల పాలనతో పోయింది. దీంతో ఏ పార్టీ కూడా కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. దీంతో 21 ఏళ్లు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను జాతీయ రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌గా మార్చేశారు. ఢిల్లీ పీఠంవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తన వాక్బాణాలు, డైలాగ్‌ డెలివరీ, జాతీయ లెక్కలు, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలే ఆయుధంగా ముందుకు సాగుతున్నారు.

గో హెడ్‌ కేసీఆర్‌ నీ లక్ష్యంలో నిజాయతీ.. నీ ఆరోపణల్లో కచ్చితత్వం.. దేశ ప్రజలను మెప్పించగలనన్న నీ ఆత్మవిశ్వాసం విజయ తీరాలకు చేర్చాలని ఆశిస్తున్నాం.

హ్యాపీ బర్త్‌డే టూ కేసీఆర్‌

 

కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ ద్రవ్యోల్బణంలో రికార్డు || Analysis on CM KCR Assembly Speech

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version