Ankur Jain: కొప్పుంటే సిక(జడ) ఎలాగైనా ముడవచ్చు. అలాగే డబ్బుంటే ఎన్ని వేషాలైనా వేయొచ్చు. అలాంటిదే ఈ జంట కథ కూడా. అతని పేరు అంకూర్ జైన్. అమెరికాలో టెక్ బిలియనీర్. వందల కోట్ల ఆస్తి. ఇండియన్ మూలాలు ఉన్న ఈ వ్యాపారి.. ఒకసారి జిమ్ కు వెళితే.. డబ్ల్యూ డబ్ల్యూఈ స్టార్ ఎరికా హమ్మండ్ కలిసింది. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్తా స్నేహమైంది. కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఇంకేముంది లివింగ్ లైఫ్ మొదలుపెట్టారు. చాలా సంవత్సరాల పాటు అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత పెళ్లికి ఓకే అనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల దక్షిణాఫ్రికాలో మూడు రోజులపాటు సఫారీ పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం 6000 డాలర్ల వరకు ఖర్చు పెట్టారు. ఇక్కడి నుంచి ప్రైవేట్ జెట్ విమానంలో ఈజిప్టు వెళ్లారు. వారితో పాటు 130 మంది అతిథులను కూడా తీసుకెళ్లారు. అక్కడ నాలుగు రోజులపాటు వివాహ వేడుకలు జరుపుకున్నారు. ఈజిప్ట్ పిరమిడ్స్ మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. శాంపేన్ నురగలు, శాండ్లియర్ వెలుగులు, సెలబ్రిటీల తలుకుల మధ్య జైన్.. ఎరికా హమ్మండ్ ను తనదానిని చేసుకున్నాడు. చేతికి రింగ్ తొడిగి తన కౌగిలిలో బంధించుకున్నాడు.
ఎవరీ ఎరికా హమ్మండ్
ఎరికా హమ్మండ్ డబ్ల్యూ డబ్ల్యూఈ రెజ్లర్. చాలా టోర్నీలలో పాల్గొన్నది. దానికి విరామం ప్రకటించి లాస్ ఏంజిల్స్ లో రంబుల్ బాక్సింగ్ లో ట్రైనర్ గా చేరింది. అనంతరం న్యూయార్క్ వెళ్ళిపోయి స్పోర్ట్స్ న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది. స్ట్రాంగ్ అనే అథ్లెటిక్ యాప్ కూడా ప్రారంభించింది. రంబుల్ బాక్సింగ్ సెలబ్ పేరుతో ఒక జిమ్ ప్రారంభించింది. ఆ జిమ్ లోనే జైన్ కు ఎరికా హమ్మండ్ కు పరిచయం ఏర్పడింది. అలా అది ప్రేమకు దారి తీసింది.. కొద్దిరోజులు సహజీవనం చేసిన తర్వాత ఎరికా హమ్మండ్ జైన్ ను వివాహం చేసుకుంది. వివాహానికంటే ముందు ఎరికా హమ్మండ్, జైన్ దక్షిణాఫ్రికాలో జంగిల్ సఫారీ చేశారు. అడవి నడి మధ్యలో సఫారీ డిన్నర్ చేశారు. ఇలా మూడు రోజులపాటు సౌత్ ఆఫ్రికాలో గడిపారు. అనంతరం ముఖ్య అతిథులతో కలిసి ప్రైవేట్ జెట్ విమానంలో ఈజిప్ట్ వెళ్లిపోయారు.. అక్కడ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం నూతన దంపతులు పాప్ పాటలకు చిందులు వేశారు. తమ పరిచయం ఎలా మొదలైంది, అది ప్రేమగా ఎలా చిగురించింది, పెళ్లిగా ఎలా రూపాంతరం చెందింది.. ఇలా అనేక విషయాలను వివాహానికి వచ్చిన అతిథుల ఎదుట చెప్పుకున్నారు. ” పెళ్లి కోసం చాలా కలలు కన్నాం. ఆమె డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. వివాహాన్ని అంతరిక్షంలో చేసుకోవాలని భావించాం. కానీ ఈజిప్ట్ దాకా వచ్చి పిరమిడ్స్ మధ్య పెళ్లి చేసుకుంటున్నాం. ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల మీకు పువ్వులు తెచ్చే ఖర్చు తప్పిందని” అతిధులను ఉద్దేశించి జైన్ వ్యాఖ్యానించాడు. “నేను న్యూయార్క్ వాసిని. పూర్తి భిన్నమైన వాతావరణంలో ఉండడాన్ని ఇష్టపడతాను. కాబట్టి ఈజిప్టులో వివాహం చేసుకున్నా. ఇది నాకు ఒక కొత్త ప్రారంభం. నేను ప్రాచీన చరిత్ర, నాగరిక సమాజాన్ని ఇష్టపడతాను. అందు గురించే ఇక్కడికి వచ్చానని” ఎరికా హమ్మండ్ పేర్కొన్నది. ప్రస్తుతం వీరిద్దరి వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ సృష్టిస్తోంది.
View this post on Instagram