CSK Vs SRH 2024: ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా హైదరాబాద్ గెలవాలి. మరోవైపు వరుస ఓటములతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు కంటే కింది స్థానంలో ఉన్న లక్నో, ఢిల్లీ జట్లు వరుస విజయాలు సాధించాయి. ఫలితంగా పాయింట్ల పట్టికలో అవి నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చెన్నై వేదికగా గతంలో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్లు తలపడగా.. అన్నిసార్లు చెన్నై జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 20 సార్లు తలపడగా.. 14 సార్లు విజయం సాధించి చెన్నై జట్టు ముందంజలో ఉంది. హైదరాబాద్ కేవలం 6 సార్లు మాత్రమే విజయం సాధించింది.
చేపాక్ స్టేడియం లో ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలోనూ తన స్థానాన్ని దిగజార్చుకుంది. వాస్తవానికి ఈ మైదానంపై చెన్నై జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. కానీ సొంత మైదానంపై ఆ జట్టు ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేపాక్ మైదానం ఇటీవల మ్యాచులలో స్పిన్ బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో రవీంద్ర జడేజా లాంటి వారు వికెట్లు దక్కించుకోలేకపోయారు. ఇక, ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు నాలుగు విజయాలు, నాలుగు ఓటములు ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఈ స్టేడియం వేదికగా చెన్నై, హైదరాబాద్ జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. అన్నిసార్లూ చెన్నై విజయం సాధించింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా, లేక బలమైన హైదరాబాద్ జట్టు ముందు తేలిపోతుందా అనేది చూడాలి.
ఇక హైదరాబాద్ జట్టు విషయానికొస్తే.. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్లే ఆఫ్ ఆశలను మరింత బలోపేతం చేసుకోవాలంటే హైదరాబాద్ చెన్నై మీద గెలవడం తప్పనిసరి. ఒకవేళ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోతే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోతుంది. అప్పుడు జట్టు ఆడే అన్ని మ్యాచ్లను కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమైపోతాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ ఎనిమిది మ్యాచ్లు ఆడింది. ఐదు విజయాలు దక్కించుకుంది. ఇటీవల బెంగళూరు మ్యాచ్లో భీకరమైన ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్, మార్క్రం, క్లాసెన్ విఫలమయ్యారు.. నితీష్ రెడ్డి మెరుపులు మెరిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో మీరు కచ్చితంగా తమ పూర్వపు లయ అందుకోవాల్సి ఉంది. వారి పైనే హైదరాబాద్ జట్టు ఆశలు పెట్టుకుంది. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్, మార్క్రం, క్లాసెన్ విఫలం కావడంతో.. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
గుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచేందుకు 49 శాతం, చెన్నై జట్టు గెలిచేందుకు 51 శాతం అవకాశాలున్నాయి.
జట్ల అంచనా
హైదరాబాద్
అభిషేక్ శర్మ, హెడ్, మార్క్రం, నితిష్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్, నటరాజన్ (ఇంపాక్ట్)
చెన్నై
రుతు రాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్య రహనే, మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, మహేంద్ర సింగ్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, రెహమాన్, మతీష పతీరణ.