
Natasha Periyanayagam: కొందరు తమ వయసుకు మించిన తెలివిని ప్రదర్శిస్తారు. తమ స్థాయి కంటే పైస్థాయి సమస్యలను అలవోకగా పరిష్కరిస్తారు. ఎలాంటి పరీక్ష ఐనా సరే ఉన్నతమైన ప్రతిభతో ఉత్తీర్ణులవుతారు. చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తారు. ఇంతటి ప్రతిభ పుట్టుకతోనో.. అదృష్టంగానో వస్తుందనుకుంటే అది మన భ్రమే. పట్టుదల, నిరంతర సాధనతోనే ఎలాంటి ప్రతిభ ఐనా మన సొంతం అవుతుంది. జగజ్జేతగా నిలుపుతుంది.
నటాషా పెరియనాయగమ్.. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. ఇప్పుడు ప్రపంచంలోనే తెలివైన అమ్మాయిగా రికార్డులకెక్కింది. కీర్తిని గడించింది. అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ.. సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పోటీల్లో నటాషా అద్భుత ప్రతిభ కనబరిచింది. ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ పోటీల్లో 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కేవలం 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించారు. వారిలో నటాషా ప్రథమ స్థానంలో నిలిచి ఘనత సాధించింది.
తమ వయసు కంటే ఎక్కువ తెలివితేటలను ప్రదర్శించే విద్యార్థులను గుర్తించేందుకు సీటీవై పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. నటాషా న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్లో చదువుతోంది. 2021లో నిర్వహించిన పోటీల్లో కూడా నటాషా తన ప్రతిభను నిరూపించుకుంది. అప్పటికి ఐదో తరగతి చదువుతున్న ఆమె.. ఎనిమిదో తరగతి స్థాయి విద్యార్థి ప్రతిభను చాటింది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 శాతం స్కోర్ సాధించింది. తాజాగా సీటీవై నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఏటీసీ, పరీక్షల్లో అద్భుతంగా స్కోర్ చేసినట్టు హాప్ కిన్స్ యూనివర్శిటీ ప్రకటన విడుదల చేసింది.

“ విద్యార్థులు ఒక పరీక్షలో సాధించిన విజయాన్ని గుర్తించడమే కాదు. నేర్చుకోవాలనే పట్టుదల, ఆసక్తితో వయసుకు మించిన జ్ఞానాన్ని సంపాదించారు. దీనిని మనమంతా గుర్తించాలి“ అని సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెల్టాన్ తెలిపారు. నటాషా తల్లిదండ్రులు ఇండియాలోని చెన్నై నగరానికి చెందిన వారు. ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. నటాషా సాధించిన ఘనత పుట్టుకతో వచ్చిన ప్రతిభ కాదు. అలవోకగా సాధ్యమైన విషయం కాదు. సుదీర్ఘ ఏకాగ్రత, నిరంతర కష్టం, పట్టుదలతో సాధ్యమైందని చెప్పవచ్చు. ఒక్క రోజులోనో.. ఒక్క సంవత్సరంలోనో సాధించిన ఘనత కాదు. ఎన్నో ఏళ్ల కష్ట ఫలితం అని చెప్పవచ్చు. ప్రతిభ అనేది ఒక చర్య కాదు. ఒక అలవాటు. మన నిరంతర అలవాట్ల సమాహారం అని పెద్దలు చెబుతుంటారు. అక్షరాల అదే నిజం.
