
AP CM Jagan: వైసీపీ సర్కారులో అంతర్మథనం ప్రారంభమైందా? రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడాన్ని తట్టుకోలేకపోతోందా? ప్రభుత్వం చెప్పే మాటల కంటే విపక్షాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్నే ప్రజలు నమ్ముతున్నారా? ప్రధానంగా విద్యావ్యవస్థ విషయంలో ప్రభుత్వం చేసిన మంచి కంటే చెడు హైప్ అవుతోందా? అందుకే జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు పడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకూ రాజకీయ విమర్శలకు పరిమితమైన వైసీపీ నేతలు విధానపరమైన, పాలనాపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాజాగా మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి తెరపైకి వచ్చారు. విద్యావ్యవస్థ కోసం జగన్ సర్కారు పడిన ఆరాటాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
ఏపీలో జగన్ సర్కారు అన్నింటా విఫలమైంది. అన్నిరంగాలను నిర్వీర్యం చేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. అయితే ఒక విద్యా వ్యవస్థ విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ సర్కారుకు మంచి మార్కులే పడుతున్నాయి. అందుకే దానిని క్యాష్ చేసుకునే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా విద్యా వ్యవస్థపై రూ.30 వేల కోట్లు ఖర్చుపెట్టిన సర్కారు తమదేనంటూ ప్రకటనలు జారీచేస్తున్నారు. దీని వెనుక వైసీపీ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంటా బయటా విపక్షాల కంటే వారే ప్రభుత్వంపై వ్యతిరేక విమర్శలకు దిగుతున్నారు. దీంతో జగన్ సర్కారు అప్రమత్తం కావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పథకం అమ్మఒడి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలని చూడకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏటా అమ్మఒడి సాయాన్ని జమ చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ పథకం సక్సెస్ ఫుల్ గా నడిపించారు. జగన్ సర్కారు పట్ల ప్రజలు సానుకూలత చూపించే పథకం అమ్మఒడిదే కీలక స్థానం. అటు నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలల అధునికీకరణ, మౌలిక వసతుల కల్పన కూడా మన్ననలు అందుకుంది. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అయితే అంతవరకూ బాగానే ఉంది. కానీ జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల కుదింపు, విలీనం వంటి చర్యలు ప్రతికూలతలుగా మారాయి. ఎక్కడికక్కడే పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో నాడు,నేడు పథకంలో చేసిన మంచి వెనక్కి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.

అదే సమయంలో విదేశీ విద్యాదీవెన పథకానికి నిధుల కేటాయింపు, మంజూరు, ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా విడుదల చేయడం లేదని జగన్ సర్కారుకు విమర్శలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఈ విమర్శలకు ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. విద్యకు, మానవ వనరుల అభివృద్ధికి జగన్ సర్కారు చేసినంతగా దేశంలో మరే ప్రభుత్వం చేయలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విలేఖర్ల సమావేశం పెట్టి మరీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు విద్యను నిర్లక్ష్యంగా విడిచిపెట్టారని.. అది ప్రభుత్వ బాధ్యత కాదని చేతులు దులుపుకున్నారని.. కానీ జగన్ మాత్రం విద్యను బాధ్యతగా తీసుకున్నారని చెప్పారు. 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అదంతా పేద విద్యార్థుల కోసమేనన్నారు. చివరకు టీడీపీ నేత కుమార్తెకు విద్యాదీవెన కింద రూ.84 లక్షలు చెల్లించారని గుర్తుచేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. విపక్షాల విమర్శలు అర్థం లేనివన్నారు.
