India vs Bangladesh: రెండు వన్డే మ్యాచ్లు బంగ్లాదేశ్ గెలిచింది. అలా అనేకంటే భారత్ విజయాలను చేజార్చుకుంది. ఓపెనర్లలో నిలకడ లేదు.. భారీ స్కోరు సాధించాలనే సోయి ఇతర ఆటగాళ్లలో లేదు. ఏదో టోర్నీ ఉంది… వచ్చాం.. ఆడాం అన్నట్టుగా ఆటగాళ్ల తీరు ఉంది. ఫలితంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లను భారత్ కోల్పోయింది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఆట తీరుపై ఇంటా బయట ఒత్తిడి వస్తోంది. మరి కొద్ది రోజుల్లో వరల్డ్ కప్ జరగను నేపథ్యంలో ఇలాంటి ఆట తీరు ప్రదర్శిస్తే కప్ ఎలా సాధిస్తారని సీనియర్ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ క్రీడా సమాఖ్య చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ ఆటగాళ్ల తీరు మారలేదు.. ఈ విమర్శలు అన్నింటికీ ఈరోజు భారత జట్టు చెక్ పెట్టింది.

దుమ్ము దులిపింది
నామమాత్రమైన మూడో వన్డే ఇవాళ భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ నిర్ణయం ఎంత తప్పో ఆయనకు ఈశాన్ గుర్తు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఎప్పటిలాగే శిఖర్ ధావన్ నిరాశపరిచాడు. 15 పరుగులకే మొదటి వికెట్ భారత్ కోల్పోయింది.. దీంతో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ వచ్చాడు. కానీ అప్పటికే కిషన్ జోరు మీద ఉన్నాడు. అగ్నికి వాయువు తోడైనట్టు ఇశాన్ కు, కోహ్లీ జతకలిసాడు. వీరిద్దరూ కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో చూస్తుండగానే కిషన్ ఆఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్ల ను ఒక ఆట ఆడుకున్నాడు. వీరిద్దరిని విడదీసేందుకు లిటన్ దాస్ బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
డబుల్ కొట్టాడు
ఈరోజు కిషన్ బ్యాటింగ్ చూసిన ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే. అతడి కళాత్మక డ్రైవ్ లు, ఫోర్ హ్యాండ్ సిక్సర్లు ప్రేక్షకులను మైమరింపజేశాయి. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే ఒకప్పటి ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ గంగూలీ గుర్తుకు వచ్చాడు. ఏ బౌలర్ ని కూడా లెక్కచేయకుండా మైదానంలో వీర విహారం చేశాడు. ఇదే దశలో 131 బంతుల్లో 210 పరుగులు చేసి కిషన్ అవుట్ అయ్యాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.. ఇక డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారత బ్యాట్స్మెన్ గా కిషన్ రికార్డు సృష్టించాడు. అప్పటికే అతడికి నీరసం రావడంతో క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. కిషన్, కోహ్లీ కలిసి రెండో వికెట్ కు 290 పరుగులు జోడించారు. వీరు ఇద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపలేదు. 50 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 8 వికెట్లు నష్టపోయి 409 పరుగులు చేసింది.

ప్రభావం చూపలేదు
అనంతరం చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఏమాత్రం ప్రభావం చూపలేదు. స్కోర్ భారీగా ఉండటంతో బంగ్లా ఆటగాళ్లు కూడా ఒకొంత నిరుత్సాహంతోనే బ్యాటింగ్ కు దిగారు.. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేయడంతో బంగ్లా బ్యాట్స్మెన్ బెంబేలెత్తారు. ఆ జట్టులో షకీబ్ ఉల్ హాసన్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపలేదు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఇండియా 227 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లో శార్దుల్ మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. రెండు వన్డే ల్లో ఎదురైన ఓటమికి భారత జట్టు ఈ విజయం ద్వారా ఆ కసి తీర్చుకుంది. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి ఇషాన్, సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు..