
India vs Australia 2nd Test Day 2: గవాస్కర్, బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా 262 పరుగులకు ఆల్ ఔట్ అయింది. లయాన్ విశ్వరూపం చూపడంతో భారత బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. లయాన్ దెబ్బకు ఒకానొక దశలో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, జడేజా బాధ్యతా యుతంగా ఆడారు. ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ముర్ఫీ విడ దీశాడు. తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ వ్యక్తిగత స్కోర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూనేమాన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ నిదానంగా ఆడారు.. జట్టు స్కోరు ముందుకు నడిపించారు. 8 వికెట్ కు రికార్డ్ స్థాయిలో 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ జోడిని కమిన్స్ విడదీశాడు. ఆ తర్వాత అక్షర్,షమీ వెంట వెంటనే ఔట్ అయ్యారు. దీంతో 262 పరుగులకు ఇండియా ఆల్ ఔట్ అయింది.
లయాన్ విశ్వరూపం
తొలి ఇన్నింగ్స్ లో ఇండియా త్వరగా ఆల్ అవుట్ అవ్వడానికి ప్రధాన కారణం లయన్. లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు.. అందులో నాలుగు వికెట్లు లయాన్ తీసినవే. రాహుల్, రోహిత్ శర్మ, పుజారా, అయ్యర్.. ఇలా టాప్ నాలుగు వికెట్లు తీసి ఇండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి టెస్ట్ లో తన శిష్యుడు మర్ఫీ అధిక వికెట్లు తీస్తే… రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో లయాన్ ఐదు వికెట్లు తీశాడు. ఇండియా భారీ స్కోర్ సాధించకుండా చూశాడు.
ఇప్పుడు కూడా వీరే
తొలి టెస్ట్ లో రోహిత్, జడేజా, అక్షర్, అశ్విన్ ఆకట్టుకున్నారు. రెండో టెస్ట్ లోనూ వారే కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా అక్షర్, అశ్విన్ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. 139 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను కాచుకుంటూ 114 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లేకుంటే భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. చివర్లో షమి నుంచి మెరుపులు మేరవకపోవడంతో ఇండియా 262 పరుగులకు ఆల్ ఔట్ అయింది.

ఆస్ట్రేలియాకు 61 పరుగుల ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా. ధాటిగా బ్యాటింగ్ చేసింది. మైదానం నిర్జీవంగా మారడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడారు. 23 పరుగుల వద్ద ఖవాజా వికెట్ కోల్పోయినప్పటికీ..హెడ్, లబూ షేన్ ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఫలితంగా 60 పరుగుల ఆధిక్యం లభించింది. హెడ్ 39, లబూ షేన్ 13 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నారు.