
India vs Australia 2nd Test Day 1: తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలయిన ఆసీస్ రెండో టెస్ట్ లో ఆ తాలూకూ చాయలు కనిపించనీయలేదు. బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత్ బౌలర్లను సమర్థవంతంగా కాచుకుంది.. ముఖ్యంగా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ వార్నర్ తో కలిసి తొలి వికెట్ కు 50 పరుగులు జోడించాడు. ఉస్మాన్ (12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో) 81 పరుగులు చేశాడు. జడేజా బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక క్రీజ్ లో ఉంటే ఆసీస్ భారీ స్కోర్ సాధించేది. తొలి టెస్ట్ లో విఫలం అయిన వార్నర్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్ లో శ్రీకర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇదే సమయంలో స్మిత్ డక్ ఔట్ కావడం, లబూ షేన్, హెడ్ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ఆసీస్ కష్టాల్లో పడ్డది.
ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన హ్యాండ్స్ కాబ్ నిల బడ్డాడు. కానీ అతడికి కమిన్స్ తప్ప మిగతా వారు అండగా నిలబడకపోవడంతో ఒంటరి పోరాటం చేశాడు. హ్యాండ్స్ కాబ్ తొమ్మిది ఫోర్ల సహాయంతో 72 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. కమిన్స్ 33 పరుగులు చేసి ధాటిగా ఆడే క్రమంలో జడేజా బౌలింగ్ లో ఎల్ బీ డబ్ల్యు గా ఔట్ అయ్యాడు. మర్ఫీ, లియాన్, కునే మాన్ వెంట వెంటనే ఔట్ అయ్యారు. మొత్తానికి 263 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

తొలి టెస్ట్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు.. రెండో టెస్టులో మాత్రం వికెట్ల కోసం చెమటోడ్చారు.. మైదానం స్కిన్ కు అనుకూలిస్తున్నప్పటికీ… మహమ్మద్ షమీ పిచ్ పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ వికెట్లు రాబట్టాడు.. ఈ మ్యాచ్లో వార్నర్, హెడ్, లయన్, కునే మాన్ వికెట్లు తీసి ఆస్ట్రేలియా కు చుక్కలు చూపించాడు.. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీశాడు. లబు షేన్, స్మిత్,క్యారీ వికెట్లు తీశాడు. ముఖ్యంగా స్మిత్ ను డక్ ఔట్ చేసిన విధానం ఈ ఇన్నింగ్స్ కే హైలెట్. జడేజా కూడా తన మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించాడు.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఖవాజా,కమీన్స్, మర్ఫీ వికెట్లు తీశాడు. ఈ వికెట్లతో 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
అనంతరం తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా వికెట్లు ఏమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్ సహాయంతో 13 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులు చేసి క్రీజు లో ఉన్నారు.