Homeక్రీడలుIndia Vs New Zealand 1st T20: ఇండియా–న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌.. అందరి దృష్టి ఆ...

India Vs New Zealand 1st T20: ఇండియా–న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌.. అందరి దృష్టి ఆ ఐదుగురిపైనే!

India Vs New Zealand 1st T20: భాతర పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌కు వరుస ఓటములతో ముఖం వాచిపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. గెలుపు కోసం కివీస్‌ ఆటగాళ్లు ఎంత శ్రమించిన గెలుపు అంచులవరకు వచ్చి ఓడిపోతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో (శుక్రవారం సాయంత్ర) నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లలోని ఐదుగురిపై అందరి దృష్టి పడింది.

India Vs New Zealand 1st T20
India Vs New Zealand 1st T20

వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌..
భారత్, న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం నుంచి టీ–20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా రాంచీ వేదికగా మొదటి టీ–20 మ్యాచ్‌లో కివీస్‌తో తలపడనుంది. రెండు జట్లు యువ ఆటగాళ్లతో బరిలో దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా, న్యూజిలాండ్‌ టీ20ల్లో 22 సార్లు తలపడగా, 12 మ్యాచ్‌ల్లో ఇండియా, 9 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించాయి. ఒకటి టైగా ముగిసింది.

ఆ ఐదుగురిపైనే అందరి దృష్టి..
తాజాగా ప్రారంభమయ్యే టీ–20 సిరీస్‌లో ఐదుగురి ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉంది. ఇటీవల భారత టీ–20 పగ్గాలు అందుకున్న హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో పాండ్యా బ్యాటుతో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్‌.. 131.34 స్ట్రైక్‌ రేట్‌తో 176 పరుగులు చేశాడు. 7.43 ఎకానమీ రేటుతో 7 వికెట్లు తీశాడు. టీ–20ల్లో కీలకమైన ఆటగాళ్లలో హార్డిక్‌ పాండ్యా ఒకడు. భారత్‌ వర్సెస్‌ కివీస్‌ టీ–20 సిరీస్‌లో హై ఎక్స్‌పెక్టెషన్స్‌ ఉన్న ఆటగాళ్లలో ఒకడు.

– ఇక ఆలస్యంగా భారత జట్టులో చోటు సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌ అతి తక్కువ కాలంలోనే తన బ్యాటింగ్‌ విన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టీ–20లో ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్యకుమార్‌ను ఎస్‌కేవై, మిస్టర్‌ 360 డిగ్రీ అనే పేర్లతో పిలుస్తుంటారు. విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన సూర్యకుమార్‌యాదవ్‌ ప్రస్తుతం టీ–20ల్లో వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. 2022లో ఐసీసీ మెన్స్‌ టీ–20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 31 టీ–20 మ్యాచ్‌ల్లో 46.56 సగటు, 187.43 స్ట్రైక్‌ రేట్‌తో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై సూర్యకుమార్‌ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడాడు. 89.05 స్ట్రైక్‌రేట్, 86.34 సగటుతో కివీస్‌పై 518 పరుగులు చేశాడు. దీంతో నేటి నుంచి ఆరంభమయ్యే టీ–20 సిరీస్‌ లో మరోసారి సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ విన్యాసాలను తిలకించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

India Vs New Zealand 1st T20
India Vs New Zealand 1st T20

– ఇక టీ–20ల్లో భారత్‌కు నమ్మదగిన బౌలర్‌గా అర్షదీప్‌సింగ్‌ గుర్తింపు పొందాడు. బాల్‌ను రెండు వైపులా స్వింగ్‌ చేయగల సత్తా ఇతని సొంతం. డెత్‌ ఓవర్లలో యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి, 8.93 ఎకానమీతో 14 వికెట్లు సాధించాడు. భారత్, కివీస్‌ టీ–20 సిరీస్‌లో ఇతని ప్రదర్శనపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అర్షదీప్‌సింగ్‌ అప్పుడప్పుడు బౌలింగ్‌లో లయ తప్పుతుండడం మైనస్‌గా మారింది. ఇటీవల లంకతో జరిగిన టీ–20 సిరీస్‌లో పదేపదే నోబాల్స్‌ వేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంది.

– ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ అద్భుతంగా రాణించాడు. మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగి కివీస్‌ను గెలిపించేంత పని చేశాడు. టీ–20 సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ఆటగాళ్ల జాబితాలో ఇతను ఒకడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 183.67 స్ట్రైక్‌ రేట్‌తో 90 పరుగులు చేశాడు. అలాగే 17 వికెట్లు పడగొట్టాడు.

– పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌ కీలక ఆటగాళ్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒకడు. వన్డే ఫార్మాట్‌తో పోలిస్తే టీ20ల్లో అతనికి మంచి రికార్డ్‌ ఉంది. హార్డ్‌– హిట్టర్‌గా గుర్తింపు పొందిన ఫిలిప్స్‌ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. దీంతో భారత బౌలర్లు ఫిలిప్స్‌ను ఎంత త్వరగా ఔట్‌ చేస్తే అంత మంచిది. ఫిలిప్స్‌ ఇప్పటివరకు టీ–20ల్లో 148.26 స్ట్రైక్‌ రేట్‌తో 1361 పరుగులు చేశాడు. భారత్‌పై అతనికి మంచి రికార్డ్‌ ఉంది. పది మ్యాచ్‌ల్లో 167.92 స్ట్రైక్‌రేట్‌తో 356 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌ యావరేజ్‌ 40గా ఉంది. న్యూజిలాండ్‌ టీమ్‌ ఫిలిప్స్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version