Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్లకు పుణ్యం, పురుషార్థం ఉంటుంది. కానీ ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసిన తరువాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందులో రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నట్టు రాసుకొస్తారు. గత మూడున్నరేళ్లుగా ప్రతీసారి అటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుండడంతో జాతీయ మీడియా వర్గాలు సైతం జగన్ టూర్ కు ప్రాధాన్యం తగ్గించేశాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు ఇలా అన్నిరకాల ప్రస్తావనలు ఢిల్లీ పెద్దల వద్ద తెచ్చినట్టు జగన్ చెబుతారు కానీ ఒకదానికి ధ్రువీకరణ ఉండదు. అటు కేంద్ర పెద్దలు కూడా కలయిక వరకూ ట్విట్ చేస్తుంటారు కానీ వారెందుకు కలిశారని చెప్పరు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి విపక్షాలు మాత్రం పర్సనల్ అజెండాతో వెళుతుంటారని విమర్శిస్తుంటాయి. అయితే దీనిని జగన్ లైట్ తీసుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీ నేతలు మాత్రం మా సీఎం కేంద్ర పెద్దలను కలిస్తే మీకేంటి బాధ అని దబాయిస్తుంటారు. కానీ తాజాగా జగన్ షడన్ గా ఢిల్లీ టూర్ కు డిసైడ్ అయ్యారు. ఈ నెల 30న టూర్ షెడ్యూల్ ఖరారైనా… దానిని కాస్తా ముందుకు జరిపి ఇవాళే హస్తినా బాట పడుతుండడం రకరకాల అనుమానాలు చక్కెర్లు కొడుతున్నాయి.
రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారు. అటు పవన్ సైతం దూకుడు పెంచారు. పొత్తుపై స్ఫష్టమైన సంకేతాలు పంపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నట్టు పవన్ చర్యలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ తమతో కలిసి వస్తుందని విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోనివ్వకుండా చేసే బాధ్యత తనదని.. ఎన్నికల పొత్తులు, వ్యూహాలు తనకు వదిలేయ్యాలని పవన్ కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఇచ్చిన సమాచారం, స్వేచ్ఛతోనే ఆయన ప్రకటనలు చేయగలుగుతున్నారని జగన్ లో అనుమానిస్తున్నారు. దాదాపు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండడంతో ఆయనలో కలవరం ప్రారంభమైంది.
మరోవైపు బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచుతోంది. విచారణకు హాజరుకావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు జారీచేసింది. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని మలివిడత నోటీసులిచ్చారు. తొలిసారిగా ఈ నెల 23న నోటీసులిచ్చారు. 24న హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయని చెప్పి ఐదు రోజుల పాటు ఆయన గడువు అడిగారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకానున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే ఆయన్ను నిందితుడిగా భావించి పిలిచారా? లేకుంటే సాక్షిగా విచారణకు పిలిచారా? అన్నది తేలాల్సి ఉంది.
ఈపరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ షడన్ టూర్ అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి సీఎం జగన్ గుంటూరు జిల్లా పొన్నూరు, హైదరాబాద్ పర్యటలకు షెడ్యూల్ ఖరారైంది. కానీ వాటన్నింటినీ రద్దు చేసుకొని ఈ రోజే హస్తినా పయనమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ పూర్తిచేసుకొని ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అక్కడ ఎవరెవర్ని కలుస్తారు? ఎందుకు కలుస్తారు? అన్నది మాత్రం బయటకు చెప్పడం లేదు.. ఢిల్లీ పెద్దలను కలిసిన తరువాత షరా మామ్మూలుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారో.. లేకుంటే ఈసారైనా నిజం చెబుతారో చూడాలి మరీ.