Homeక్రీడలుIndia vs New Zealand: 20 ఓవర్లు, నాలుగు వికెట్లు: 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు...

India vs New Zealand: 20 ఓవర్లు, నాలుగు వికెట్లు: 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీం ఇండియా ఆపసోపాలు

India vs New Zealand: 100 పరుగులు… మరీ అంత పెద్ద లక్ష్యం కాదు.. టి 20 ల్లో అయితే అసలు లక్ష్యమే కాదు.. కొసాఖరికి ఐర్లాండ్ కూడా చేజ్ చేయగలిగేస్కోరిది.. సూర్య కుమార్ యాదవ్ ఉఫ్ మని ఊదేయగల స్కోర్ ఇది. కానీ దీన్ని ఛేదించేందుకు టీం ఇండియా పడరాని పాట్లు పడ్డది.. చివరి బంతి వరకు పోరాడింది.. ఒకరకంగా చెప్పాలంటే చచ్చి చెడి గెలిచింది.

India vs New Zealand
India vs New Zealand

సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీం ఇండియా సత్తా చాటింది. లక్నో వేదికగా ఆదివారం ఉత్కంఠ గా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టి20ల సిరీస్ ను 1-1తో సమం చేసింది.. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది.. ఆ జట్టులో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (19 నాట్ అవుట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా, హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చాహల్, దీపక్ హుడా, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.

ఒక్క సిక్స్ కూడా లేదు

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 100 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.. సూర్య కుమార్ యాదవ్ ( 31 బంతుల్లో ఫోర్ సహాయంతో 26 నాట్ అవుట్), హార్థిక్ పాండ్యా ( 20 బంతుల్లో ఫోర్ సహాయంతో 15 నాట్ అవుట్) చివరి వరకు నిలిచి భారత జట్టుకు విజయాన్ని అందించారు.. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్, సోది తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఒక సిక్స్ కూడా కొట్టలేకపోయాయి.. దీంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురయింది.. బ్యాటింగ్ మెరుపులు లేకపోయినా…ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. ఆఖరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది.

100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ గిల్(11) మరోసారి విఫలమయ్యాడు. బ్రేస్ వెల్ వేసిన నాలుగో ఓవర్లో క్యాచ్ అయ్యాడు.. వన్డే ఫార్మాట్ లో ప్రతిభ కనపరచిన గిల్.. టి20 లో మాత్రం తడబాటు కొనసాగిస్తున్నాడు.. క్రీజు లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి తో కలిసి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆచితూచి ఆటంతో పవర్ ప్లే లో టీం ఇండియా వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది.
పవర్ ప్లే అనంతరం క్రీజులో సెట్ అయిన ఇషాన్ కిషన్ (19) గ్లేన్ పిలిప్స్ సూపర్ ఫీల్డింగ్ కు రన్ అవుట్ అయ్యాడు.. క్రీజులోకి సూర్య కుమార్ యాదవ్… భారీ షాట్ కు ప్రయత్నించి రాహుల్ త్రిపాఠి (13) క్యాచ్ ఔట్ అయ్యాడు.. దీంతో మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ ను ముందుకు పంపించింది.. గత మ్యాచ్ లో ఇదే టర్నింగ్ వికెట్ పై హాఫ్ సెంచరీ చేయడంలో అతడికి ప్రమోషన్ ఇచ్చింది.. అయితే గ్లేన్ పిలిప్స్ వేసిన 15వ ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ కారణంగా సుందర్ (10) రన్ అవుట్ అయ్యాడు. సుందర్ చెప్పేది వినకుండా లేని పరుగుకు ప్రయత్నించగా… సుందర్ తన వికెట్ త్యాగం చేశాడు.

టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా?

క్రీజులోకి హార్దిక్ పాండ్యా లాగా… సూర్య ఆచితూచి ఆడాడు.. స్పిన్నర్ల కోటా పూర్తి అయిన తర్వాత చెల రేగుదాం అనుకున్న ఈ జోడికి శాంట్నర్ ఊహించని షాక్ ఇచ్చాడు.. పార్ట్ టైం స్పిన్నర్ చాప్ మన్ ను రంగంలోకి దింపాడు. దీంతో షాక్ అయిన హార్దిక్, సూర్య సింగిల్స్ కు మాత్రమే పరిమితమయ్యారు.. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో శాంట్నర్ ఐదు పరుగులు ఇవ్వడంతో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి.

India vs New Zealand
India vs New Zealand

కొంపముంచిన టిక్నర్

ఫెర్గూ సన్ వేసిన 19 ఓవర్ లో తొలి నాలుగు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే రావడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది.. అని ఐదు బంతికి బౌండరీ బాదిన హార్దిక్ పాండ్యా.. చివరి బంతికి సింగిల్ తీశాడు.. దీంతో ఆరు బంతులకు ఆరు పరుగులు అవసరమయ్యాయి.. చివరి ఓవర్ ను టెక్నర్ వేయగా తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.. ఈ పరిస్థితుల్లో సూర్య ఇచ్చిన రిటర్న్ క్యాచ్ తో పాటు, హార్దిక్ పాండ్యా రన్ అవుట్ అయ్యే అవకాశాలను టిక్నర్ నేలపాలు చేశాడు.. ఈ అవకాశంతో సూర్య బౌండరీ బాది మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.. టిక్నర్ అ క్యాచ్ పట్టినా, రన్ అవుట్ చేసినా భారత్ ఓటమి పాలయ్యేది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version