Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో ఆ ముగ్గురు నేతలకు ఇప్పుడు ఒక టెన్షన్ పట్టుకుంది. అది జనసేన రూపంలో. ఆ ముగ్గురూ గతంలో పవన్ తో పనిచేసిన వారే. కానీ ఇప్పుడు అదే పవన్ ను చూసి భయపడిపోతున్నారు. తమ రాజకీయానికి చెక్ చెబుతాడన్నబెంగ వారిని వెంటాడుతోంది. జనసేన యువశక్తి కార్యక్రమంతో తమపై ఎలాంటి సందేశమిస్తాడో అని భయపడుతున్నారు. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రణస్థలం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉంది. తూర్పుకాపు సామాజికవర్గం ఎక్కువ. పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం కూడా. అందుకే వ్యూహాత్మకంగా యువశక్తి నిర్వహణకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సభ నిర్వహణకు 25 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని ఇచ్చేందుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఇక్కడ పవన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీకి సన్నద్దమవుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా పదవి చేపట్టారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. అయితే ఎన్నికలకు ముందే యువశక్తి రూపంలో పవన్ గట్టి సవాలే విసురుతున్నారు. ఒక వేళ టీడీపీలో పొత్తు ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పవన్ కోరే నియోజకవర్గం ఇదేనన్న టాక్ నడుస్తోంది. తూర్పుకాపులతో పాటు మత్స్యకార సామాజికవర్గ ప్రభావం అధికంగా ఉండడంతో ఇక్కడ జనసేన అభ్యర్థిని బరిలో దింపితే సునాయాస విజయం సాధిస్తారని నమ్మకంగా చెబుతున్నారు. అదే కానీ జరిగితే కళా వెంకటరావుకు దెబ్బ. రాష్ట్రస్థాయి సమీకరణల్లో భాగంగా ఆయన సీటు వదులుకోలేని తప్పనిసరి పరిస్థితి. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కళా వెంకటరావు పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేయడం గమనార్హం.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. తాను ముందుగా ఎమ్మెల్యేను, తరువాత స్పీకర్ నని ప్రత్యర్థులకు తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. జనసేనతో పాటు పవన్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేనను లైట్ తీసుకొని హేళనగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేనకు అభిమానులు ఎక్కువ. నియోజకవర్గంలోని బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో తూర్పుకాపుల ప్రాబల్యం ఎక్కువ. పవన్ కు హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పడు వీరంతా సంఘటితమవుతున్నారు. స్పీకర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పొత్తు ఉన్నా.. లేకున్నా తమ్మినేని ఓటమికి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు యువశక్తి వేదికగా పవన్ కూడా తమ్మినేనిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో తమ్మినేని పీఆర్పీ తరపున పోటీచేశారు.

శ్రీకాకుళం జిల్లాలో నోరు పారేసుకునే నేతల్లో అగ్రగణ్యుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, బూతులతో విరుచుకుపడుతుంటారు. బహుశా ఆయనలో ఈ సుగుణం నచ్చే జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాసే వైసీపీ క్యాండిడేట్ గా జగన్ ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి అయిందానికి.. కానిదానికి రాజకీయ ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు. విధ్వంసాలకు దిగుతున్నారు. అచ్చెన్నాయుడుపై వాడని భాషను ప్రయోగించి మరీ తిట్ల దండకానికి దిగుతున్నారు. పవన్ కే చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. టెక్కలి జనసేన కార్యాలయం విధ్వంసం వెనుక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ వ్యవహార శైలిపై పవన్ యువశక్తిలో విరుచుకుపడే అవకాశముంది. అటు దువ్వాడ సైతం 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే ఈ ముగ్గురి నేతలకు ఇప్పుడు యువశక్తి రూపంలో సవాల్ ఎదురుకానుంది. పవన్ తమ రాజకీయ ఆధిపత్యానికి గండికొడతారన్న భయం వెంటాడుతోంది.