Minister Seediri Appalaraju: జనసేన, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందు వరుసలో ఉండే మంత్రి అప్పలరాజు ముచ్చెమటలు పడుతున్నారు. ఇంతవరకూ ఆయన జనసేనను లైట్ తీసుకున్నారు. చాలా తక్కువ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు అదే జనసేనను చూసి తెగ భయపడుతున్నారు. ఆయన కంటి నిండా కునుకు కూడా కరువవుతోంది. ఇప్పటివరకూ తన వెంట నడుస్తున్న వారు సడెన్ గా యూటర్న్ తీసుకోవడంతో ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో మత్స్యకారులు ఎక్కువ. దాదాపు 11 మండలాల్లో 5 లక్షల మంది మత్స్యకార జనాభా ఉన్నారు దాదాపు 2 లక్షలకుపైగా ఆ సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు వీరంతా జనసేన వైపు అడుగులేస్తుండడంతో అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.

వైసీపీ గత ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజును బరిలో దించింది. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు జగన్ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటిచ్చారు. విస్తరణలో కూడా సీనియర్లకు కాదని అప్పలరాజుకు కొనసాగింపు ఇచ్చారు. కేవలం మత్స్యకారులను ఓటు బ్యాంక్ గా చేసుకునే వ్యూహంలో భాగంగా అప్పలరాజును ప్రోత్సహించారన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే అప్పలరాజు ఇప్పటివరకూ మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టులు లేవు. జిల్లాకు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు మంజూరైనట్టు ప్రభుత్వం ప్రకటించినా.. అవి పట్టాలెక్కించడంలో ఫెయిలయ్యారు. కనీసం భూ సేకరణలో కూడా ఒక అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కారణంగా .. అనూహ్యంగా మత్స్యకారులు జనసేన వైపు టర్న్ అవుతున్నారు.
ఒకరిద్దరకు పదవులిచ్చినంత మాత్రన తమ బతుకుల్లో ఎటువంటి వెలుగులు రావడం లేదని.. కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థిక, విద్య,వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలను అభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగుపరిస్తేనే తమ బతుకులు బాగుపడతాయని మత్స్యకార యువత భావిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. అందుకే జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు. దాదాపు 11 మండలాల్లోని ప్రతీ మత్స్యకార గ్రామంలో జనసేన కమిటీలు ఏర్పాటు వెనుక ఆ సామాజికవర్గ యువత ప్రభావం అధికంగా ఉంది. ఇన్నాళ్లూ సామాజికవర్గం వెనుకబాటుకు ఇప్పటివరకూ వచ్చిన పార్టీలు, ప్రభుత్వాలే కారణమన్న ఆగ్రహం యువతలో ఉంది. అందుకే వారు జనసేనను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు.

ఇప్పటికే పవన్ రూపంలో మత్స్యకారులకు చాలారకాలుగా అండ దొరికింది. గత ఎన్నికల తరువాత పవన్ మత్స్యకారుల సమస్యలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. మత్సకారులకు భరోసా ఇచ్చే చాలా రకాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. అసలు మత్స్యకారుల సమస్యలేమిటి? ఎందుకు వలసపోతున్నారు? స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడానికి కారణాలేంటి? ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలేమిటి? వలసల నియంత్రణ ఎలా సాధ్యం? అన్న దానిపై ఒక ప్రత్యేక నివేదిక రూపొందించారు. యువశక్తి కార్యక్రమంలో ఇదో ప్రాధాన్యతాంశంగా చేర్చారు. నేరుగా కొంతమంది మత్స్యకార యువత నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. వారిని వేదికపై మాట్లాడించే అవకాశం కల్పించనున్నారు.
తాజా పరిణామాలతో వైసీపీ కలవరపాటుకు గురవుతోంది. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల రూపంలో ఎదురు దెబ్బ తప్పదని భావిస్తోంది. అందుకే మంత్రి అప్పలరాజుకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఎప్పుడూ పలాస గడప దాటని ఆయన జిల్లాలోని 11 మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అక్కడ కుల సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. తనకున్న బలాన్ని, బలగాన్ని దింపి మత్స్యకార యువత జనసేన వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. యువత స్వచ్ఛందంగా కమిటీలు ఏర్పాటుచేసి యువశక్తి కార్యక్రమాన్ని జనాలను తరలించేందుకు ఏర్పాటుచేస్తున్నారు.