Tirumala Face Recognition: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల రద్దీ తగ్గుతోంది. ఒకటి రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సోమవారం 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 24 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా కూడా భారీగానే ఆదాయం వచ్చింది. రూ.5.71 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కాలం కావడంతో అవి ముగిశాక ఎక్కువ మంది స్వామి వారిని దర్శించకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
దీంతో టీటీడీ ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. దళారుల ప్రమేయాన్ని దూరం చేసేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పిస్తున్నారు. దీనికి ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ్టి నుంచే ఫేషియల్ రికగ్నైజ్ వ్యవస్థ అమలులోకి తీసుకురానున్నారు. ప్రయోగాత్మకంగా పరిశీలించి తరువాత పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవస్థ విజయవంతమైతే తిరుమలలో గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది.
రెండో వైకుంఠం కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగంలోకి తీసుకురానున్నారు. గదుల కేటాయింపు, లడ్డు ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎఫ్ ఆర్టీ యంత్రాలను అమర్చుతారు. ఇక మీదట తిరుపతిలో దళారుల వ్యవస్థ లేకుండా చేయడమే దీని ఉద్దేశం. ఇన్నాళ్లు దళారులకు అడినంత ఇచ్చుకుంటూ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మీదట వారి ప్రమేయం లేకుండా చేయాలనే ఆలోచనతో టీటీడీ ఇలా చేస్తోంది.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టినా త్వరలో దీన్నిపూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ పథకాన్ని కొనసాగించే విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని పథకం కొనసాగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక నుంచి దళారులకు ఎలాంటి ప్రమేయం దక్కకుండా చేసి భక్తులకు లాభం చేకూర్చేందుకు నిర్ణయం తీసుకోనుంది. దీనిపై భక్తులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.