Vinay Hiremath: ఆ సినిమాలో చెప్పినట్టుగానే ఓ వ్యాపారి జీవితంలో జరిగింది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నూటికి నూరు శాతం నిజం.. మనలో చాలామంది బాగా సంపాదించాలి అనుకుంటారు. డబ్బును విపరీతంగా పోగుచేసి.. కార్లు, బంగ్లాలలో తిరగాలి అనుకుంటారు. బంగారాన్ని కూడా పెట్టి స్టేటస్ ప్రదర్శించాలని భావిస్తారు. ఖరీదైన సూట్లు, విలువైన బూట్లు ధరించి పదిమందిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు.. ఇవేవీ తప్పుడు లక్షణాలు కావు. తప్పు అని చెప్పేంత అవ లక్షణాలు కూడా కావు. అయితే తినగా తినగా వేప తీయగా ఉంటుంది. కానీ డబ్బు సంపాదించి సంపాదించి.. ఒక స్థాయికి వచ్చేసరికి దానిమీద విరక్తి కలుగుతుంది. పూర్వకాలంలో తన రాజ్యాన్ని, రాజరికాన్ని చూసిన తర్వాత.. ఓ రాజుకు విరక్తి కలిగింది. ఒక స్థాయికి వచ్చేసరికి తనమీద తనకు అసహ్యం కలిగింది. వెంటనే తన పదవిని, రాజ్యాన్ని వదిలేశాడు. మానసిక ఆనందం కోసం తపించాడు. వెంటనే అడవులకు వెళ్లిపోయాడు. అక్కడ తనకు ఇష్టం వచ్చినట్టుగా బతికాడు. చివరికి ఒకరోజు కన్నుమూశాడు.
జీవితంలో ఆనందం కావాలి
డబ్బు అనేది సౌకర్యాన్ని అందిస్తుంది. సౌలభ్యాన్ని కల్పిస్తుంది. సుఖాన్ని దక్కేలా చేస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి భౌతిక అవసరాలు. భౌతిక అవసరాలు ఒక స్థాయి దాటిన తర్వాత ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ మానసిక సౌకర్యాలు అలా కాదు.. ఆనందం, సంతోషం అనేవి మనిషిని మానసికంగానే కాదు, శారీరకంగానూ ఆనందంగా ఉండేలా చేస్తాయి. ఆ మానసిక ఆనందం కోసం భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త వెంపర్లాడుతున్నాడు. వినయ్ హిరేమత్ (Vinay Hiremath) అనే భారత (India) సంతతికి చెందిన వ్యాపారవేత్త లూమ్(LOOM) అనే టెక్ సంస్థను ఏర్పాటు చేశారు. అద్భుతమైన లాభాలను సాధించారు. గత ఏడాది ఆ సంస్థను అట్లా సియాన్(Atla sian) అనే సంస్థకు విక్రయించారు. ఇలా విక్రయించడం ద్వారా వినయ్ కి 975 మిలియన్ డాలర్లు లభించాయి. భారత కరెన్సీ ప్రకారం 8000 కోట్లకు పైమాటే. ప్రస్తుతం వినయ్ వయసు 35 సంవత్సరాల లోపు మాత్రమే. అయితే అంత డబ్బు ఉన్న తర్వాత వినయ్ ఆడంబరాన్ని కోరుకోలేదు. విలాసాన్ని ఇష్టపడలేదు. తన కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకోలేదు. పైగా సామాజిక మాధ్యమాలలో వైరాగ్యం తో కూడిన వ్యాఖ్యలు చేశారు. ” నేను డబ్బు సంపాదించాను. శ్రీమంతుడిగా మారాను. కానీ ఈ డబ్బును ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఆర్థిక స్వేచ్ఛ విపరీతంగా ఉన్నప్పటికీ ఒక సంధి దశలో ఉన్నాను. జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగిలేను. అసలు ఈ ఉద్దేశాన్ని ఎలా ప్రకటించాలో అర్థం కావడంలేదని” వినయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వినయ్ కి అట్లా సియాన్ కంపెనీలోనే పనిచేసే అవకాశం లభించింది. కంపెనీ అతడికి ఏకంగా 60 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆఫర్ చేసింది. అయినప్పటికీ వినయ్ అవకాశాన్ని ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం వినయ్ హవాయి దీపంలో భౌతిక శాస్త్రాన్ని నేర్చుకునే పనిలో పడ్డాడు.