Snakebite Venom: పాము విషానికి విరుగుడు.. ఐఐఎస్సీ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి

వాస్తవానికి ఒక పాము కాటు వేస్తే ఆ విషం ద్వారా మనిషి శరీరంలోని రక్తంలోకి ప్రాణాంతక విష పదార్థాలు విడుదలవుతుంటాయి. అవి మనిషి నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

Written By: Suresh, Updated On : February 23, 2024 1:14 pm
Follow us on

Snakebite Venom: శాస్త్ర సాంకేతిక రంగాలు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందిన ఈ కాలంలో.. నేటికీ పాము కాటు వేస్తే కచ్చితంగా బతికి బట్ట కడతాడు అనే నమ్మకం లేదు. వైద్య రంగంలో ఎన్నో రకాలుగా వినూత్న విధానాలు అభివృద్ధి చెందినప్పటికీ.. పాము కాటు వేస్తే కచ్చితంగా దాని విషాన్ని నిరోధించే ఔషధాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పామును బట్టి.. కాటు వేసినప్పుడు అది విడుదల చేసే రసాయనాలను బట్టి.. దానికి విరుగుడుగా ఇంజక్షన్ రూపొందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ దిశగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సఫలమైనట్టు తెలుస్తోంది. బెంగళూరు శాస్త్రవేత్తలతో పాటు అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

వాస్తవానికి ఒక పాము కాటు వేస్తే ఆ విషం ద్వారా మనిషి శరీరంలోని రక్తంలోకి ప్రాణాంతక విష పదార్థాలు విడుదలవుతుంటాయి. అవి మనిషి నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాయి. ఆ విషపదార్థాలు పై ప్రక్రియలన్నింటిని ఏకకాలంలో చేస్తాయి కాబట్టే మనిషి త్వరగా ప్రాణాలు కోల్పోతాడు. అయితే పాము కాటు వేసినప్పుడు.. అది విడుదల చేసే విష పదార్థాలకు విరుగుడును బెంగళూరు ఇండియన్ సైన్స్ శాస్త్రవేత్తలు సృష్టించారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే మానవ యాంటీబాడిని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఐవీ, కోవిడ్ – 19 ను ఎదుర్కొనే యాంటీ బాడీల అధ్యయనం ఈ పరిశోధన చేసేలా శాస్త్రవేత్తలను ప్రేరేపించింది. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో రూపొందించిన సింథటిక్ యాంటీ బాడీ తాచుపాము, నాగుపాము, కట్ల పాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషానికి విరుగుడుగా పని చేయగలదు. ఈ పాములు కాటు వేయడం వల్ల ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్నారు. కొంతమందిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు మాత్రమే బతికి బట్ట కట్ట కలుగుతున్నారు.. ప్రస్తుతం గుర్రాలు కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు ప్రాణంతకంగా మారుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో యాంటి సింథటిక్ బాడీలను తయారు చేయడం విశేషం. సింథటిక్ బాడీల తయారీలో ఎటువంటి జంతువులను హింసించే అవకాశం ఉండదు. వాటిపై ప్రాణాంతక ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. వైరస్ ప్రజననం ద్వారా ఈ యాంటీ బాడీలు రూపొందించారు. ఇవి పాము విడుదల చేసే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాలను నిర్వీర్యం చేస్తాయి. మనిషి వ్యవస్థల పనిచేయకుండా కట్టడి చేయగలుగుతాయి. దానివల్ల కొంతకాలం అస్వస్థతకు గురైనప్పటికీ తర్వాత మనిషి కోలుకుంటాడు. పాము విషంలో ఉన్న వివిధ రకాలైన ప్రాణాంతక పదార్థాల విరుగుడుగా శాస్త్రవేత్తలు ఈ యాంటీ బాడీ ని సృష్టించారు. కాగా, ఈ యాంటీ బాడీ తయారీతో గుర్రాలు, కంచర గాడిదల ప్రాణాలకు ముప్పు తప్పినట్టేనని చెబుతున్నారు.