Actor Ali: అలీ కోసం ఆ స్థానాన్ని సిద్ధం చేసిన జగన్

మారిన రాజకీయ వ్యూహంలో భాగంగా అలీ ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సమాచారం. గత కొద్దిరోజులుగా కర్నూలు, నంద్యాల, రాజమండ్రి పార్లమెంట్ స్థానాల నుంచి అలీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

Written By: Dharma, Updated On : February 23, 2024 1:11 pm
Follow us on

Actor Ali: సినీ నటుడు అలీకి జగన్ టికెట్ ఖరారు చేశారా? ఆయనకు కీలక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దించనున్నారా? ఇప్పటికే డిసైడ్ అయ్యారా? అదే విషయాన్ని అలీకి చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో అలీ యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. తన మనసులో ఉన్న మాటను హై కమాండ్ కు చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ప్రకటించారు.

అయితే మారిన రాజకీయ వ్యూహంలో భాగంగా అలీ ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సమాచారం. గత కొద్దిరోజులుగా కర్నూలు, నంద్యాల, రాజమండ్రి పార్లమెంట్ స్థానాల నుంచి అలీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే అలీ వ్యూహరచన చేసుకున్నట్లు కూడా టాక్ నడిచింది. మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గం రాజమండ్రిలో అలీ పర్యటించారు. మధ్యలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో సైతం పార్టీకి ప్రత్యేకంగా సమయం కేటాయించడంతో.. అలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రచారం ఊపందుకుంది.

అయితే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అలీ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ డిప్యూటీ మేయర్ ఖలీల్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. అనిల్ కు ప్రతికూల ఫలితాలు తప్పవని భావించి నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. ఖలీల్ ఎంపికను వ్యతిరేకించిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో అక్కడ బలమైన ఎంపీ అభ్యర్థితో పాటు నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి సైతం మంచి అభ్యర్థిని బరిలోదించాల్సిన అనివార్య పరిస్థితి జగన్ పై పడింది. దీంతో ఖలీల్ స్థానంలో అలీని ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది? అని జగన్ నెల్లూరు వైసీపీ నేతలు వద్ద ఆరా తీసినట్లు సమాచారం.

నెల్లూరు వైసీపీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు అండగా నిలుస్తూ వచ్చింది. కానీ ఇటీవల నేతలందరూ పార్టీని వీడుతుండడంతో ఇబ్బంది. పార్టీకి కీలకమైన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు సైతం పక్కకు తప్పుకోవడంతో వైసీపీకి ఇక్కడ ఇబ్బందికరమే. అందుకే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థులుగా అలీని బరిలోకి దించితే సానుకూల ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.